వైసీపీలో కీలక నేత, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ త్వరలో తన సంచలన నిర్ణయం ప్రకటించనున్నారు. రామచంద్రపురం అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున తన కుమారుడిని నిలబెట్టాలని బోస్ ఆశపడ్డారు. అయితే వైసీపీ అధినేత జగన్.. ఆ స్థానాన్ని జెడ్పీ మాజీ చైర్మన్ వేణుగోపాలకృష్ణకు కేటాయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ముమ్మిడివరం అసెంబ్లీ సీటు శెట్టిబలిజలకు ఇవ్వాలని బోస్ కోరారు. దీనిని కూడా కాదని అక్కడ పొన్నాడ సతీష్‌ని ఎంపిక చేశారు. దీంతో బోస్ పార్టీ అధినేత జగన్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో బోస్ వైసీపీని వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు జగన్ వద్దకు తీసుకువెళ్లారు. ఇదే సమయంలో బోస్‌కు తెలుగుదేశంపార్టీ నుంచి పిలుపు వస్తుందని పలువురు భావించారు. మరోవైపు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కోస్తా జిల్లాలే కీలకం. గత ఎన్నికలే తీసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక రెండు సీట్లు మినహాయిస్తే మొత్తం అన్ని ప్రాంతాలను టీడీపీ సొంతం చేసుకుంది. అయితే ఈసారి ఎలా అయినా అక్కడ పట్టు నిలుపుకోవాలి అని వైసీపీ పరితపిస్తోంది. అయితే ముఖ్యంగా అమలాపురం విషయమే తీసుకుంటే పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్ మరణానంతరం, జగన్ కి తోడుగా నిలబడిన వారిలో బోస్ ఒకరు. అలాంటి బోస్ కే పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని బోస్ వర్గం ఆవేదన చెందుతోంది. మరోవైపు రాజమండ్రి పార్లమెంట్ సీట్ కి వైసిపి నుంచి బరిలోకి దిగేవారి లిస్ట్ క్రమంగా పెరుగుతుంది. ఈ సీటును మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ కి ఇచ్చేందుకు అధినేత జగన్ సిద్ధమైనట్లు టాక్ వినవస్తుంది. అయితే మరికొందరి పేర్లను కూడా జగన్ పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజక వర్గాల్లో పరిశీలనలు పూర్తి చేసిందట! జగన్ ను కొందరు కలిసి.. ఎంపీ సీటు పై తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే సుభాష్ చంద్ర బోస్ ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉండటంతో బాటు 2021 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో మరొకరికి ఛాన్స్ ఇస్తే మంచిదని వైసిపి వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.