ఇటీవల కాలంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఏ వేదిక ఎక్కినా.. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలనూ తమకే కట్టబెట్టాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిని గుండుగుత్తుగా తమ పార్టీకే అప్పగిస్తే.. కేంద్ర ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడిస్తామని, ఏపీకి రావాల్సిన అన్నింటినీ తీసుకువస్తానని, ఏపీని స్వర్గధామం చేస్తామని ఆయన చెప్పుకొస్తున్నారు. దీనికి ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ కూడా వంత పాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ వారినే 25 స్థానాల్లోనూ గెలిపించాలని పాట పాడుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుడు కానీ తాము అభివృద్ధి చేయలేమని చెప్పుకొస్తున్నారు. అయితే, ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ ఓ లాజిక్ వెలుగులోకి తెచ్చారు.గత 2014 ఎన్నికల్లో ఏపీలోకి 25 స్థానాల నుంచి 17 మంది(ఇద్దరు బీజేపీ) స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. పోనీ.. బీజేపీ ఎంపీలు హరిబాబు, గంగరాజును పక్కన పెట్టినా 15 మంది టీడీపీకి ఎంపీలు ఉన్నారు. వీరు చాలరన్నట్టుగా వైసీపీ నుంచి గెలుపొందిన ఇద్దరు చంద్రబాబు వల విసిరి పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో ఆయన బలం 17కి చేరింది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఏ పార్టీలో ఉన్నారో ? ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు వైసీపీకి ఉన్న ఐదుగురు ఎంపీలు కూడా ప్రత్యేక హోదా కోసం ఇటీవల రాజీనామాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఉన్న 17 మందితో కేంద్రంపై పోరాడే అవకాశం టీడీపీకి వచ్చిందన్నది జగన్ మాట. మరి ఇంత మంది ఎంపీలను చేతిలో పెట్టుకున్న చంద్రబాబు కేంద్రంపై పోరాడే శక్తి లేక.. ఇప్పుడు ప్రతి విషయంలోనూ రాజీ పోరాటం చేస్తున్నారన్న ఆయన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి.ఇక, ఇప్పటికే ఉన్న ఎంపీలతో కేంద్రంపై పోరు చేయలేని చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో 25 మంది ఎంపీలను ఇస్తే. ఏం చేస్తాడని ఆయన ప్రశ్నించ డంలో లాజిక్ ఉందనేది విశ్లేషకుల మాట. నిజానికి 17 మంది ఎంపీల బలం ఉన్న బాబు.. కేంద్రంతో నాలుగేళ్లు మిత్రపక్షంగా ఉన్నబాబు.. ఏపీకి ఏమీ చేయలేకపోయారు. పోనీ.. కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టిన తర్వాత కూడా కేంద్రం నుంచి ఒక్కరూపాయి తెచ్చుకోలేక పోయారు. ధర్మ పోరాట దీక్షలకు, ధర్మ పోరాట సభలను ఆర్భాటంగా నిర్వహించినా కేంద్రం నుంచి పైసా నిధులను రాబట్టుకోలేని స్థితిలో కూరుకుపోయారు.కేంద్రం ఆడించినట్టు బాబు ఆడుతున్నారు.. తప్ప.. ఇప్పటికీ కేంద్రాన్ని ఆయన ఆడించేస్థితిలోకానీ, స్థాయిలోకానీ లేకపోవడం గమనార్హం. ప్రత్యేక హోదా ఇవ్వనన్నప్పుడే కేంద్రంపై తిరుగుబాటు చేయాల్సిన బాబు.. అప్పుడు తలాడించి.. కేంద్రంతో లాలూచీ రాజకీయాలు చేశాడు. హోదా వద్దన్నాడు. ఇప్పుడు మాత్రం నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి అనడం వెనుక కేవలం ఎన్నికల యావ తప్ప మరొకటి లేదనేది వాస్తవమని జగన్ మాట. మరి దీనికి టీడీపీ నేతలు, బాబు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనికి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.