అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజల కష్టాలు, సమస్యలు తీర్చడంలో ఉద్యమపార్టీ టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని, పది రోజు బిజెపి జనచైతన్యయాత్రలో ప్రజలు అడుగడుగునా తమ సమస్యల గోడు వెల్లబోసుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ అన్నారు. ప్రజల సమస్యలు చెప్పుకుందామంటే టీఆర్ఎస్ గడీల తలుపులు తెరుచుకోవడం లేదని, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వివిధ వర్గాల ప్రజలు బిజెపి వైపు ఆశగా చూస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ పేర్కొన్నారు.పదో రోజు జనచైతన్య యాత్ర జగిత్యాల జిల్లా రాజారంపల్లికి చేరుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష ప్రజావాహినిని ఉద్దేశించి డాక్టర్ లక్ష్మన్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపిస్తే.. సీఎం కేసీఆర్ మాత్రం ఫాం హౌజ్‌లో పడుకుని బంగారు తెలంగాణ అంటూ కలలు కంటున్నారని, నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలోప్రజలకు మిగిలింది త్యాగాలు, కష్టాలు, కన్నీళ్లేనని డాక్టర్ లక్ష్మన్ ఆవేదన వ్యక్తం చేశారు.
40 ఏళ్ల కాంగ్రెస్ పాలన..నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలన ఒకే విధంగా ఉందని, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పాలకులు పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు తేలేకపోయారని, ఇప్పుడు పేదల జీవితాల్లో మార్పు కోసమే బిజెపి యాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చిందని, ప్రజల జీవితాల్లో మార్పు కేవలం బిజెపితోనే సాధ్యమని డాక్టర్ లక్‌్మ్న్ స్పష్టం చేశారు.
ప్రజలు తాగునీరు లేక, సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... టీఆర్ఎస్ సర్కార్ మాత్రం పల్లెపల్లెలో బార్లు తెరిచి బీర్లు అందిస్తున్నారని, రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ.. పేదల జీవితాల్లో చిచ్చు పెడుతుందన్నారు. ప్రజలను మత్తులో ముంచి వాళ్ల జీవితాలు నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా..? అని డాక్టర్ లక్ష్మన్ సభాముఖంగా ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలే తమ ప్రాధాన్యం అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చినా ధర్మపురి ప్రాంతం ఎందుకు ఎండుతోంది. ధర్మపురి చుట్టూ నీళ్లు ఉన్నా..ఇక్కడి భూములు ఎడారిగా మారినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తమాషా చూస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ మండిపడ్డారు.నీళ్లు పారాల్సిన కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో కమీషన్లు పొంగి పొర్లుతున్నాయని, లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో గోదావరి నీటిని ఇతర ప్రాంతాలకు తరలించి.. ఇక్కడి భూములను ఎండబెడితే ధర్మపురి ప్రజలు చూస్తూ ఊరుకోరని డాక్టర్ లక్ష్మన్ హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్నది కౌలురైతులే
సమగ్ర కుటుంబ సర్వేతో అన్ని లెక్కలు తేల్చుతాం అన్న సీఎం.. కౌలు రైతుల లెక్కలు ఎందుకు తేల్చలేకపోతున్నారని, కౌలు దారి చట్టాన్ని అమలు చేయకుండా వారి జీవితాలను బుగ్గి పాలు చేస్తున్నారన్నారు. కౌలు దారులకు బిజెపి ప్రభుత్వం అండగా ఉంటుందని, బిజెపి అధికారంలోకి రాగానే కౌలు దారు చట్టాన్ని అమలు చేస్తామని డాక్టర్ లక్ష్మన్ హామీ ఇచ్చారు.
రైతులను పట్టించుకోని కేసీఆర్.. గద్వాల వెళ్లి మళ్లీ దీవించండని అడుగుతున్నారు.. రైతులను మోసం చేసినందుకు దీవించాలా..? రైతులకు బేడీలు వేసినందుకు దీవించాలా ? అని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు.కేంద్రం నిధులు ఇస్తున్నా..సాక్షర భారత్ కార్యకర్తలకు కనీసం వేతనం ఇవ్వడం లేదని, రేషన్ డీలర్లు కమీషన్ పెంచమంటే..వారిని తొలగిస్తామని బెదిరిస్తున్నారని, వారి డిమాండ్ల సాధనకు వారికి అండగా ఉంటామని డాక్టర్ లక్ష్మన్ చెప్పారు.బతుకమ్మ చీరల పేరుతో..సూరత్ నుంచి నాశిరకం చీరలు తెచ్చి ఇటు మహిళలను..అటు నేత కార్మికులను అవమానించారని, నేతన్నల ఓట్లు కావాలి కానీ.. వాళ్ల తలరాతలు మార్చక్కర్లేదా ..? అంటూ డాక్టర్ లక్ష్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం అరాచక పాలనను అణచివేచినట్లే..టీఆర్ఎస్ పార్టీని ఈ ప్రజలు మట్టికరిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన మండిపడ్డారు.పేదలకు ఇళ్లు, తాగు, సాగుకు నీళ్లు..నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టే..ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, పేదల జీవితాల్లో మార్పు రావాలంటే బిజెపి అధికారంలోకి రావాలని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు.సామాజిక న్యాయం కేవలం బిజెపి వల్లే సాధ్యమని, బిజెపికి తెలంగాణలో అధికారం కట్టబెడితేనే అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కథ ముగిసింది. ఇక కమ్యూనిస్టుల కోటలు బద్దలయ్యాయి. ఇక తెలంగాణలోనూ గడీల పాలనకు బిజెపి గండి కొడుతుందని, డాక్టర్ లక్ష్మన్ ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ లక్ష్మన్ చేపట్టిన జన చైతన్యయాత్రకు అడుగడుగునా అపూర్వ స్పందన వస్తోంది. పదోరోజు యాత్రకు బిజెపి శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. గొల్లపల్లి నుంచి దాదాపు 400 బైకులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బిజెపి యాత్రతో స్థానిక యువత, కార్యకర్తల్లో ఎక్కడ లేని ఉత్సాహం పెల్లుబికింది.
సభకు మాజీ ఎమ్మెల్యేలు నల్లు ఇంద్రసేనారెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, బిజెపి నాయకులు ఏ ఎస్ కుమార్, ఇతర నాయకులు హాజరయ్యారు.