పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్‌పై స్టే కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం లభించలేదు. దీంతో ప్రాజెక్టు పనులపై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సంయుక్త, అదనపు కార్యదర్శులు ఆమోదముద్ర వేసి కార్యదర్శి సీకే మిశ్రాకు పంపారు. ఆయన నుంచి అనుమతి పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు పడిగాపులు కాసినా ఫలితం లేకపోయింది. అటవీ శాఖ అధికారులు ఫైలుకు ఆమోదముద్ర వేస్తే కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు చేరుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆయన ఈ నెల 5వ తేదీ రాత్రి హస్తినకు రానున్నారు. ఈలోగా పర్యావరణశాఖ కార్యదర్శి పచ్చజెండా ఊపితే కేంద్ర మంత్రి తుది ముద్ర వేసే అవకాశం ఉంటుంది. లేదంటే మరికొంత జాప్యం జరిగే ప్రమాదం ఉందని ఏపీ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.పోలవరం ప్రాజెక్టు పనులకు అడగుడుగునా అడ్డంకులు కొనసాగుతున్నాయి. మూడేళ్లలో ఏపీ ప్రభుత్వం పనులను గాడిలో పెట్టినప్పటికి స్టాప్ వర్క్ టెన్షన్ కొనసాగుతోంది. ఒడిసా, ఛత్తీస్ గఢ్ ముందు నుంచీ అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. 2015లో నిర్మాణ పనులు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్..ఎన్‌జీటీ.. ‘స్టాప్ వర్క్’ ఆదేశాలిచ్చింది. అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ఈ ఆదేశాలపై 2016లో స్టే ఉత్తర్వులిచ్చారు. దీంతో.. 2017 జూలై 2వరకూ ప్రాజెక్ట్ పనులు కొనసాగించే అవకాశం కలిగింది. ఈ గడువు ముగిసేలోగా మరోసారి స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. కేంద్రమంత్రి జవదేకర్ సానుకూలంగా స్పందించి.. ఏకంగా రెండేళ్లపాటు స్టే పొడిగిస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఇది అమల్లోకి వచ్చి ఉంటే 2019 దాకా స్టే ఉత్తర్వు కొనసాగింది. అయితే.. ఈ స్టే ఉత్తర్వు జారీ చేసేలోగా జవదేకర్‌ను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చారు. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన అనిల్ దవే స్టే కాలపరిమితిపై సందేహాలు వ్యక్తం చేసి.. చివరకు స్టాప్ ఆర్డర్‌పై స్టేను ఏడాదికే పరిమితం చేశారు. దీంతో జూలై 2వ తేదీతో స్టే గడువు ముగిసింది.చాలారోజుల క్రితమే స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. స్టే ఎందుకు కొనసాగించాలో స్పష్టం చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు లేఖ కూడా రాసింది. మరో వైపు ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన రెండ్రోజులకే ఒడిసా సీఎం లేఖ రాశారు. తమ అభ్యంతరాలను అందులో పేర్కొన్నారు. ఆయన చెప్పిన కారణాలు సహేతుకంగా లేవంటూ ఆంధ్ర జలవనరుల కార్యదర్శి కేంద్ర పర్యావరణ అటవీశాఖకు వివరిస్తూ మరో లేఖ రాశారు. స్టే పొడిగింపుపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి ఝా సానుకూలంగా ఉన్నా.. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కేంద్రం స్టాప్ ఆర్డర్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నన్న టెన్షన్ కొనసాగుతోందిమరోవైపు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ స్టే పొడిగింపుకు సానుకూలంగానే ఉన్నా కేంద్ర అటవీ శాఖలోని ఉన్నతాధికారులు వివిధ పనులపై విదేశాలకు వెళ్లారు. వీరిసంతకాలు ఉంటేనే.. స్టే పొడిగింపు అమల్లోకి వస్తుంది. లేదంటే.. పోలవరం పనులు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. ఒడిసా సీఎం అభ్యంతర లేఖ, దానికి రాష్ట్రప్రభుత్వం పంపిన ప్రతిస్పందనను పరిశీలించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఒక నోట్‌ను తయారు చేసింది. దీనిపై సంతకం చేయాల్సిన ఆ శాఖ సంయుక్త కార్యదర్శి అమెరికా పర్యటనకు వెళ్లారు. మంత్రి హర్షవర్ధన్ దానిపై ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం జాప్యం జరిగినా.. పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులు ముందుకు సాగవని ఇంజినీర్లు భావిస్తున్నారు.స్టాప్ వర్క్ ఆర్డర్‌పై స్టే ఎంత ఆలస్యమైతే.. అంతకు రెండింతల నష్టం వాటిల్లుతుందని జల వనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడీ వ్యవహారంపై రాజకీయ నీలినీడలు కమ్ముకున్నాయి. చంద్రబాబుపై కక్షసాధింపు ధోరణితో ఉన్న మోడీ సర్కార్... స్టే ఆదేశాలను పొడిగించకుండా సాగదీస్తుందేమోనన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులూ లేకుండా.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2018 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా రాష్ట్ర బీజేపీ నేతలు ఎంతవరకు సహకరిస్తారన్న అనుమానాలు నెలకొన్నాయి. మోడీ రాజకీయంగా వ్యవహరిస్తే పోలవరం పనులు నిలిచిపోతాయని, ప్రాజెక్ట్ పనులకు బ్రేకులు పడతాయని రాష్ట్రప్రభుత్వం ఆందోళన చెందుతోంది