జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో తిరిగి ప్రారంభమైంది. సోమవారం విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్.. మంగళవారం విశాఖ జిల్లాలో పర్యటన ప్రారంభించారు. విశాఖపట్నంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. తర్వాత అనకాపల్లి వెళ్లారు. ఈ సందర్భంగా సీనియర్ పొలిటీషియన్ దాడి వీరభద్ర రావు జనసేనానిని వెళ్లారు. దీంతో ఆయన జనసేనలో చేరతారనే దిశగా వార్తలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి బయటకు వచ్చిన దాడి వీరభద్ర రావు తర్వాత జగన్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్‌సీపీ తరఫునే ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ పార్టీలో ఎంతో కాలం ఉండలేకపోయారు. కొడుకు రత్నాకర్‌తో కలిసి జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇన్నేళ్లపాటు తటస్థంగా ఉన్న ఆయన ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో తిరిగి వైఎస్ఆర్‌సీపీలో చేరతారనే వార్తలొచ్చాయి. కానీ గత ఏప్రిల్‌లో దాడి అనూహ్యంగా జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావుతో భేటీ అయ్యారు. తామిద్దరం విమానాశ్రయంలో అనుకోకుండా కలిశామని దాడి చెప్పారు. టీడీపీలో కీలకంగా వ్యవహరించిన దాడి గంటాను కలవడంతో ఆయన టీడీపీలో చేరతారనే వార్తలు వెలువడ్డాయి. కానీ పవన్ తాజాగా దాడి ఇంటికెళ్లడంతో ఆయన జనసేనలో చేరడం దాదాపు ఖాయమైనట్టే. ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టిన పవన్.. విశాఖ జిల్లాలో పార్టీ బలోపేతంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కోన తాతారావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జనసేనలో చేరారు. సిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన బాల సతీష్ కూడా పవన్ పార్టీలో చేరారు. వీరే కాకుండా మరి కొందరు నేతలు పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. మరో ఐదు రోజులు పవన్ విశాఖలో ఉండనున్నారు. దీంతో జనసేనలో చేరికలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. విశాఖ జనసేన కార్యాలయాన్ని ఉత్తరాంధ్రకు వ్యూహాత్మక కేంద్రంగా వాడుకోనున్నారని తెలుస్తోంది.