ప్రధాని మోడీ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు వస్తున్నారు. కర్నూల్ లో అతి పెద్ద సోలార్ పార్క్ ప్రారంభోత్సవానికి రమ్మని, దాదాపు సంవత్సరం నుంచి ప్రభుత్వం అడిగినా రాని ప్రధాని, 5 కోట్ల మంది ఆంధ్రులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా రాని ప్రధాని, ఇప్పుడు వస్తున్నారు.. ఈ నెల 22న షార్ కు రానున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో సుమారు రూ. 650 కోట్లతో నిర్మించిన రెండవ రాకెట్ వాహన అనుసంధాన భవనాన్ని మోడీ ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు. పర్యటన ఖరారు కావడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో భారత శాస్త్రవేత్తలు వివిధ విభాగ అధిపతులు అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్లో ప్రస్తుతం ప్రయోగాల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. అయితే అందుకు సరైన రాకెట్ వాహన అనుసంధాన భవనం లేకపోవడం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒక్క భవనం పై ఆధారపడే ప్రయోగాలు చేయాలంటే సాంకేతికంగా ఇబ్బందులు ఎదుర వుతున్నాయి. 2015లో షార్ లో రెండవ అనుసంధాన భవనాన్ని నిర్మించాలని అప్పటి ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తరువాత ఇస్రో చైర్మన్ గా పని చేసిన ఏఎస్ కిరణ్ కుమార్ ఆ ప్రతిపాదన పై ప్రతేక శ్రద్ధ చూపడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు గత రెండు సంవత్సరాల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. అయితే షార్ లో రెండో అనుసంధాన భవనానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగానే ఆ భవనాన్ని జాతికి అంకితం చేయాలని ప్రస్తుత ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ పట్టుదలతో ఉన్నారు. ఇలా దేశానికి గర్వంగా ఉండే ప్రాజెక్ట్ ల గురించి రాకీయం చెయ్యకూడదు కాని, ఈ సందర్భంలో అయినా, కానీసం ఆంధ్రప్రదేశ్ గుర్తు ఉన్నందుకు, ప్రధానికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత, ఏదన్నా కనికరించి, ఆంధ్రులు చేస్తున్న ఆందోళనలు ప్రధాని అడ్రస్ చేస్తారేమో చూడాలి.