మానస సరోవర్ యాత్రకు వెళ్లి నేపాల్ సరిహద్దుల్లోని హిల్సా వద్ద చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను ఆదుకోవాలని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కోరారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ డీజీపీ పి.అనిల్‌కు ఆర్పీ ఠాకూర్ ఫోన్ చేసి యాత్రికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అభ్యర్థించారు. మరోవైపు యాత్రికుల సొంత జిల్లాలైన కృష్ణా, ప్రకాశం, ఉభయగోదావరి తదితర జిల్లాల ఎస్పీలతోనూ డీజీపీ మాట్లాడారు. ఎప్పటికప్పుడు యాత్రికుల క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. మరోవైపు ఈ అంశాన్ని పర్యవేక్షించాలంటూ శాంతిభద్రతల అదనపు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను డీజీపీ ఆదేశించారు.