YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ పాలిటిక్స్ లో పోలరైజేషన్

ఏపీ పాలిటిక్స్ లో పోలరైజేషన్
బహుళ రాజకీయ సిద్ధాంతాలతో చైతన్యాత్మకంగా ఉన్న తెలంగాణలో బహుముఖ పోటీలు ఖాయం. అసెంబ్లీలో ఎనిమిది పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కేవలం మూడు పార్టీలకే ప్రస్తుత చట్టసభలో ప్రాతినిధ్యం ఉంది. అంత పెద్ద ఎత్తున ఏపీ పాలిటిక్స్ లో పోలరైజేషన్ సాగింది. అయితే 2019 ఎన్నికల నాటికి ముఖచిత్రం మారబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ తరహాలోనే అనేక పార్టీలు బరిలోకి దిగబోతున్నాయి. నిజానికి 2014లో కాంగ్రెసు, జైసమైక్యాంధ్ర, వామపక్షాలు పోటీ చేసినా నామమాత్రంగా మిగిలిపోయాయి. తెలుగుదేశం కూటమి, వైసీపీల మధ్యనే పోటీ కేంద్రీకృతమైపోయింది. రాష్ట్రమంతా ద్విముఖ పోటీగానే ఫలితాలొచ్చాయి. ఇప్పటి రాజకీయ ప్రస్థానం మాత్రం బహుముఖ పోటీల దిశలో నడుస్తోంది. ఈ మల్టీకార్నర్ కాంటెస్టు ఎవరికి లాభం చేకూరుస్తుంది? ఎవరికి నష్టదాయకం? త్రిశంకు సభకు దారితీస్తుందా? కింగ్ మేకర్ ఆవిర్భవిస్తారా? అన్న బహుముఖ చర్చ సాగుతోంది.ఇప్పటికే వైసీపీ, జనసేన, టీడీపీ మూడు బలమైన పక్షాలుగా బరిలోకి దిగబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వాటికి తోడు తనదైన అజెండాతో రాజకీయాన్ని ప్రభావితం చేయాలని బీజేపీ రంగంలోకి వస్తోంది. ఇందులో జనసేనకు వామపక్షాల తో పొత్తు ఖాయంగా తేలుతోంది. ఈ సారి ఒక కూటమిగా తలపడే పార్టీ జనసేన మాత్రమే. మిగిలిన పార్టీలన్నీ విడిగానే పోటీ చేయబోతున్నాయి. 2004 నుంచి 14 వరకూ అధికారపార్టీ గా ఉన్న కాంగ్రెసు పూర్తిగా మట్టికొట్టుకుపోయింది. పార్టీని పునరుజ్జీవింప చేయాలని ఏఐసీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఉమన్ చాందీ వంటి సీనియర్ నేతను ఇన్ ఛార్జిగా నియమించింది. పాత కాంగ్రెసు నాయకులందర్నీ తిరిగి పార్టీ గూటికి తెచ్చేందుకు శతధా క్రుషి చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం ఇందులో బాగమే. రాష్ట్రవిభజన విషయంలో అధిష్టానంతో తీవ్రంగా విభేదించి ఆయన బయటికి వెళ్లిపోయారు. ఆయనకు ఏపీ సమైక్యత కోసం చివరి వరకూ పోరాడిన నాయకునిగా కొంత సానుభూతి ఉంది. పార్టీలో ఒక వర్గంలో ఆయనకు బలమైన ఫాలోయింగ్ కూడా ఉంది. సమర్థ పాలకునిగా ముద్ర ఉంది. కాంగ్రెసు లో ఆయన చేరితే కొంత పాజిటివ్ వేవ్ సాధ్యమవుతుందని అధిష్టానం భావిస్తోంది.కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడంలో ద్విముఖ ప్రయోజనాలను కాంగ్రెసు ఆశిస్తోంది. కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంకును జగన్ మోహన్ రెడ్డి పార్టీ పూర్తిగా చేజిక్కించుకోగలిగింది. 2014లో కాంగ్రెసు పార్టీ కేవలం ఒకటిన్నర శాతం ఓట్లకే చతికిలపడింది. కిరణ్ కుమార్ రెడ్డి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరు.  కానీ జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు జగన్ వెంట నడుస్తున్నవారిలో కొందరు కిరణ్ అనుచరులున్నారు. కాంగ్రెసు ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదా విషయంలో తొలిసంతకం చేస్తామని ప్రకటించింది. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని విస్పష్టంగా ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రిగా కిరణ్ తనకున్న పరపతితో ఈ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే పార్టీ నిలదొక్కుకోగలుగుతుందని రాహుల్ అంచనా. అందుకే ఆయన కోసం అంతగా వెంపర్లాడుతున్నారు. ఒకవేళ ఈ మాజీ సీఎం ఓకే చెబితే రాష్ట్రంలో కాంగ్రెసు ఓటింగు శాతాన్ని నాలుగైదు శాతానికి పెంచుకోవచ్చని ఆశిస్తున్నారు. ఒక అయిదారు అసెంబ్లీ సీట్లు కూడా దక్కించుకోవచ్చుననుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెసు బలపడితే అది వైసీపీ ఓటు బ్యాంకు చీలిక ద్వారానే సాధ్యమవుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.రాష్ట్రంలో రాజకీయ పోరాటాన్ని కేంద్రం వర్సస్ ఆంధ్రప్రదేశ్ గా మలచడంలో తెలుగుదేశం పార్టీ విజయవంతమైంది. బీజేపీ ని బూచిగా చూపించి దానికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలను వ్యతిరేకించాలనే నినాదంతో టీడీపీ ముందుకెళుతోంది. ఇప్పటికే వైసీపీపై బీజేపీ ముద్ర వేసేసింది టీడీపీ. బీజేపీ అంటే భారతీయ జగన్ పార్టీ అంటూ మూడు పక్షాలూ కుమ్మక్కు అయ్యాయనే నినాదాన్ని తీసుకుంది. తద్వారా భారీ రాజకీయ ప్రయోజనం పొందాలనే దిశలో పావులు కదుపుతున్నారు చంద్రబాబునాయుడు. కాంగ్రెసు పార్టీకి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మినహాయింపులు ఇచ్చేశారు. బీజేపీని ఆడిపోసుకున్నంత మాత్రాన టీడీపీకి కలిసివచ్చేదేమీ లేదు. జగన్, పవన్ లను బీజేపీకి అంటకడితే మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఈ విషయంలో చాలా తెలివైన ఎత్తుగడలతో కదులుతున్నారు. అయితే జనసేనకు ఒక రక్షణ ఛత్రం కనిపిస్తోంది. బీజేపీని తీవ్రంగా విభేదించే వామపక్షాలతో జనసేన జట్టుకడుతోంది. అందువల్ల బీజేపీకి సన్నిహితమనే ముద్ర వేయడం కష్టం కావొచ్చు. జగన్ ను రాజకీయంగా బద్నాం చేసేందుకు కేంద్రం వర్సస్ ఏపీ ఫార్ములా ను ఎక్కుపెట్టి విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీని నుంచి బయట పడటం కొంచెం కష్టంగానే కనిపిస్తోంది. ఇదే వైఖరిని కాంగ్రెసు పార్టీ కూడా చేపడితే జగన్ ఇరుపార్టీలతో సైద్దాంతిక పోరాటం చేయాల్సి ఉంటుంది.

Related Posts