ప్రతి పంటకు నీరు..ప్రతి చేతికి పని కల్పించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఆకలి చావులు లేకుండా పోయాయని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ అహిర్ స్పష్టం చేశారు. యువత కోసం స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా పథకాలు అమలు చేస్తున్నామని, ముద్రాయోజన ద్వారా అనేక మంది యువత పారిశ్రామిక వేత్తలుగా మారుతున్నారని ఆయన తెలిపారు.
బిజెపి జనచైతన్యయాత్ర 11 వ రోజు గోదావరిఖనికి చేరుకుంది. ఇక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మన్‌తో పాటు కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్ ప్రసంగించారు. గతంలో బ్యాంకులు లోన్లు ఇవ్వాలంటే ష్యూరిటీ కావాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ ష్యూరిటీగా ఉండి యువతకు కావాల్సిన రుణాలు ఇప్పిస్తున్నారని హన్స్‌రాజు అహిర్ అన్నారు. మోదీ అధికారం చేపట్టాక.. దేశంలోని 14 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిందన్నారు.అవినీతి రహిత, పారదర్శక పాలన అందించడం వల్లే ప్రజలు బిజెపి వైపు ఆసక్తి చూపుతున్నారని, ఇక్కడి ప్రభుత్వం విస్మరించిన అంశాలను లేవనెత్తి..కేంద్రం ఇస్తున్న సాయాన్ని ప్రజలకు వివరంచడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని కేంద్రమంత్రి తెలిపారు.రాష్ట్రప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని, యూపీలో అధికారంలోకి వచ్చినట్లుగా తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం అన్నీ కుటుంబ పార్టీలేనని, ఒక్క బిజెపి వల్లే సామాజిక న్యాయం సాధ్యమవుతోందని హన్స్‌రాజ్ అహిర్ స్పష్టం చేశారు. డాక్టర్ కె లక్ష్మన్ చేపట్టిన ఈ జనచైతన్యయాత్రకు శుభాకాంక్షలు తెలిపేందుకు రావడం నిజంగా ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఓడిగడితే.. మరణశిక్ష వేసిన ప్రభుత్వం బిజెపి మాత్రమేనని, గతంలో కాంగ్రెస్ ఈ పని ఎందుకు చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. కశ్మీర్‌లో పీడీపీతో తెంచుకోగానే.. అక్కడ శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయన్నారు. భారతదేశం ఉన్నంతవరకు కశ్మీర్ మన భూభాగంలోనే ఉంటుందని, సర్జికల్ స్ట్రైక్ దెబ్బతో పాకిస్తాన్ వణికిపోయిందన్నారు. మోదీ దెబ్బతో చైనా తొకముడిచిందని హన్స్‌రాజ్ అహిర్ పేర్కొన్నారు.కేంద్రం అవలంభిస్తున్న విధానాలతో అమెరికా మనతో స్నేహ హస్తం అందించిందని, గతంలో కాంగ్రెస్ ఈ ఘనత సాధించలేకపోయిందన్నారు. కోల్ ఇండియా, సింగరేణిని కాపాడింది బిజెపి మాత్రమేనని ఆయన అన్నారు.గత నాలుగేళ్ల మోదీ పాలనలో యూరియా ధర పెరగకుండా..నాణ్యత విషయంలో రాజీ పడకుండా.. ఎలాంటి కొరత లేకుండా చర్చలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ యాత్రకు ప్రజలంతా అండగా నిలవాలని ఈ సందర్భంగా హన్స్‌రాజ్ అహిర్ ప్రజలను కోరారు.