గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన స్టాఫ్ నర్స్ అత్యాచార ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మంగళగిరి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసులో పురోగతి సాధించారు. స్టాఫ్ నర్స్‌పై అత్యాచారం ఎలా జరిగింది, నిందితులను ఎలా పట్టుకున్నామనే విషయాలను గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లి మండలానికి చెందిన 24 ఏళ్ల రాధిక గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తోంది. రాధిక మేడికొండూరు మండలం మందపాడుకు చెందిన ఓ యువకుణ్ని ప్రేమిస్తోంది. అతడు రాధికను రోజూ తన బైక్ మీద ఇంటి దగ్గర దింపేవాడు. జూన్ 29న రాత్రి పది గంటల ప్రాంతంలో వీరిద్దరూ ఆత్మకూరు సమీపంలోని డొంక రోడ్డులో మాట్లాడుకుంటుండగా.. ఇద్దరు యువకులు వచ్చి వారిని బెదిరించారు. చంపేస్తామని హెచ్చరించడంతో ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత ఆ దుండగులిద్దరూ యువతిని గ్యాంగ్ రేప్ చేశారు. తెల్లవారుజాము వరకూ తమ పశువాంఛను తీర్చుకొని ఆమె దగ్గరున్న బంగారు చెవి దిద్దులు లాగేసుకున్నారు. రాత్రంతా కూతురు ఇంటికి రాకపోవడంతో ఇంట్లో వాళ్లు కంగారు పడ్డారు. ఉదయాన్నే ఇంటికెళ్లిన ఆమె కుటుంబ సభ్యులతో గోడు వెళ్లబోసుకుంది. దీంతో వెంటనే ఆమెను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. హాస్పిటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని విచారించారు.ఈ దారుణం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ముందుగా ఆమె ప్రియుణ్ని అనుమానించారు. కానీ అతడి ప్రమేయం లేదని తేలింది. నిందితుల ఆనవాళ్లు, వారు మాట్లాడే భాష తీరు ఆధారంగా మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన రాసగిరి రాఘవయ్య అతడి బావమరిది ఇండ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తమదైన స్టయిల్లో విచారించే సరికి నిందితులు నిజం ఒప్పుకున్నారు.