YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వెలుగు జిలుగుల తెలంగాణ!!!

వెలుగు జిలుగుల తెలంగాణ!!!

“ కరెంటు వైరు  కూడా నాలాగే  సన్నగా ఉంటుంది. కానీ  టచ్ చేస్తే దానమ్మ షాక్ సాలిడ్ గా ఉంటుంది”. ఇది  జూనియర్ ఎన్టీఆర్ సినిమా డైలాగు కాదు,తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విసురుతున్న సవాలు.తెలంగాణ రాష్ట్రం అవతరణ సమయంలో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తప్పదని, పరిశ్రమలు తరలివెళతాయని సమైక్యాంధ్రవాదులు అన్నారు . చీకట్టు కమ్ముకుంటాయనే దుష్ప్రచారం విపరీతంగా జరిగింది. అన్ని అంచనాలను, అపోహలను, అనుమానాలాను, దుష్ప్రచారాన్ని ముఖ్యమంత్రి తునాతునకలు చెశారు.ఆయన సమర్ధ పాలనలో  విద్యుత్ రంగం అనూహ్యమైన విజయాలు సాధించింది.  మూడేళ్ల వ్యవధిలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఎదగడం మామూలు విషయం కాదు. దీని వెనుక బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమం జ్ఞాపకాలు ఉన్నవి.తుపాకి గుళ్ళకు నేలకు ఒరిగిన ఉద్యమ కార్యకర్తల మృత్యు ఘోష ఉన్నది.కెసిఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతిగా ఉన్నప్పుడే ఈ దుర్మార్గం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పురుటి నొప్పులు పడుతున్న సమయం అది.కరెంటు చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఆనాటి సి.ఎం. చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాయడం ద్వారా కెసిఆర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

టి.ఆర్.ఎస్.ఆవిర్భావం నాటికే బహుశా కెసిఆర్ తెలంగాణ చీకట్లను శాశ్వతంగా నిర్మూలించే రోడ్ మ్యాపును తన మదిలో సిద్ధంచేసుకొని ఉంటారు.లేకపోతే మూడేండ్ల పసి రాష్ట్రం 24 గంటల కరెంట్ సరఫరా చేసే స్థాయికి చేరడం అసాధ్యం.గాలీ, నీరు వలె కరెంటు సహజ వనరు కాదు.దాన్ని తయారు చేయాలి.నాణ్యంగా ఉండాలి.లో వోల్టేజిల సమస్యలు రాకుండా చూడాలి.సమర్ధంగా పంపిణీ చేయాలి. ఇందుకు గాను సంకల్ప బలమే కాదు, సహకరించే వ్యవస్థలు,వాటిని నడిపే సారధులు నిబద్ధతతో, నిజాయితీతో పనిచేయాలి.ట్రాన్స్ కో చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకరరావు విద్యుత్ వ్యవహారాలను కాచి వడబోసిన వ్యక్తి.అపారమైన అనుభవం, నైపుణ్యం, పరిపాలన దక్షత  ఆయన సొంతం. అందుకే ప్రభాకరరావును కెసిఆర్ ఎంచుకున్నారు.సి.ఎం. ఆలోచనలను మనసా వాచా అమలు చేస్తూ ప్రభాకరరావు  తెలంగాణ విద్యుత్ రంగ సంక్షోభాన్ని గట్టేక్కించడమే కాకుండా మిగులు విద్యుత్ రాష్ట్రంగా మలిచారు.విద్యుత్ సంస్థలను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. విద్యుత్ సంస్థలలో పనిచేసే 22,550 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు వ్యవస్థ నుంచి తప్పించి నేరుగా జీతాలు చెల్లిస్తున్నది. విద్యుత్ సంస్థల్లో  కొత్తగా 13,357 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది.2౦14  లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం  విద్యుత్ రంగంలో పుంజుకుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచుకున్నది.విద్యుత్ రంగంలో  దేశానికి ఆదర్శంగా నిలిచే స్థాయికి తెలంగాణ ఎదిగింది. మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ రంగం స్వరూపాన్ని మార్చి వేసిన క్రెడిట్  ముఖ్యమంత్రి కెసిఆర్ దే.  2014జూన్ 2వ తేదీన ఆవిర్భవించే నాటికి విద్యుత్ సమస్యలతో తెలంగాణ  రాష్ట్రం సతమతమైంది. కాని మూడున్నర సంవత్సరాల్లో మిగులు విద్యుత్ దిశగా అడుగులు వేసింది. రాష్ట్రంలో పుష్కలమైన థర్మల్, సౌర విద్యుత్ లభిస్తోంది. 2792 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి దేశంలో అగ్ర స్థానంలో నిలిచిన ఖ్యాతి తెలంగాణకు దక్కింది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఉన్న 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు వ్యవసాయ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. నూతన సంవత్సరం 2018 జనవరి 1వ తేదీ నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. దేశచరిత్రలోనే తొలిసారిగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లో ఎక్కనుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన సమయంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తప్పదని, పరిశ్రమలు తరలివెళతాయని, చీకట్టు కమ్ముకుంటాయనే దుష్ప్రచారం విపరీతంగా జరిగింది. అన్ని అంచనాలను పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో విద్యుత్ రంగం అతి తక్కువ వ్యవధిలో  మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగింది.తెలంగాణ రైతాంగం దశాబ్దాల పాటు అనుభవించిన  కరెంటు కష్టాలకు   కొత్త సంవత్సరం తెర దిన్చుతున్నది. గత జూలై  నుంచి పాత మెదక్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో రైతులకు 24 గంటల విద్యుత్  సరఫరా అందుబాటులోకి వచ్చింది. ఈ  రబీ నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతరాయ కరెంటు సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ ఏర్పాట్లు పూర్తి  చేసింది. అందుకు కావాల్సిన విద్యుత్ ను కూడా సమకూర్చుకుంటున్నది. ఇటీవల రాష్ట్రంలో 9,500 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడినా ఎక్కడా రెప్పపాటు కూడా కోత విధించకుండా రికార్డు స్థాయిలో 198 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయడం మరొక సంచలనం.రబీ సీజన్ లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఏర్పడే, 11,000 మెగావాట్ల డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు సర్వసన్నద్ధంగా ఉన్నవి.గతంలో నిత్యం కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ నగరంలో రోజూ రెండు నుంచి నాలుగు గంటలు, ఇతర నగరాలు - పట్టణాల్లో ఆరు గంటలు, గ్రామాల్లో 9 గంటలు అధికారిక విద్యుత్ కోతలు అమలయ్యేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలుండేవి. కావాల్సినంత కరెంటు లేకపోవడంతో పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడ్డాయి. కరెంటు కోసం ఫిక్కి, సిఐఐ ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలు నిత్యం ధర్నాలు చేసేవారు. అటు ఇందిరా పార్కు, ఇటు విద్యుత్ సౌధలో ఎప్పుడూ ఆందోళనలే కొనసాగేవి. హైదరాబాద్ లో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే వాతావరణం ఉండేది. వ్యవసాయానికి రెండు మూడు గంటల కరెంటు కూడా అందకపోవడంతో పంటలు ఎండిపోయేవి. భూగర్భంలో నీళ్లున్నా తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంట కళ్లెదుటే ఎండిపోతున్నా రైతాంగం ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడేది. అపారమైన పంట నష్టం రైతులను ఆర్థికంగా కృంగదీసేది. చిమ్మ చీకట్లు అలుముకున్న దుస్థితి నుంచి వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరణకు సి.ఎం. ఎంతో కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే, విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి, అమలు చేసింది. దాదాపు 94వేల కోట్ల రూపాయల వ్యయంతో  తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా నత్తనడకన నడుస్తున్న ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పరుగులు పెట్టించింది. కొత్త ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేసింది..
డిస్ట్రిబ్యూషన్ల లైన్లు కూడా భారీ స్థాయిలో పెంచడం జరిగింది. 33 కెవి లైన్లు నాడు 17,760 కిలోమీటర్లుంటే, అదనంగా 4,180 కిలోమీటర్లు వేయడం జరిగింది. 11 కెవి లైన్లు నాడు 1,20,834 కిలోమీటర్లుంటే, కొత్తగా 25,551 కిలోమీటర్లు వేయడం జరిగింది. ఎల్.టి. లైన్లు నాడు 2,94,374 కిలోమీటర్లుంటే, కొత్తగా 21,302 కిలోమీటర్లు వేయడం జరిగింది. మొత్తం డిస్ట్రిబ్యూటరీ లైన్లు నాడు 4,32,968 కిలోమీటర్లుంటే, కొత్తగా 51,033 కిలోమీటర్లు జతచేయడం ద్వారా నేడు తెలంగాణలో 4,84,001 కిలోమీటర్ల లైన్లు అందుబాటులోకి వచ్చాయి.పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం హైటెన్షన్ సరఫరా సామర్థ్యాన్ని 12,653 మెగావాట్ల నుంచి 20,660 మెగావాట్లకు పెంచడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం చూపించిన చొరవ కారణంగా ఉత్తర, దక్షిణ గ్రిడ్ ల మధ్య కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం కూడా జరిగింది. వార్దా-మహేశ్వరం వయా డిచ్ పల్లిల మధ్య 765 డబుల్ సర్క్యూట్ లైన్ నిర్మాణం పూర్తయింది. వరంగల్-వరోరా లైను మరో మూడేళ్లలో నిర్మాణం పూర్తవుతుంది. ఈ లైన్ల ద్వారా తెలంగాణ రాష్ట్రం 2,000 మెగావాట్ల విద్యుత్ పొందడానికి వీలుగా పిజిసిఐఎల్ తో ఒప్పందం చేసుకుంది.  ఈ లైన్ల ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా కావాల్సినంత విద్యుత్ పొందే వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి కలిగింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిరంతర విద్యుత్ సరఫరా జరగడానికి వీలుగా జిహెచ్ఎంసి చుట్టూ 142 కిలోమీటర్ల మేర 400 కెవి రింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైన్లను అనుసంధానం చేయడం కోసం 220 కెవి సబ్ స్టేషన్లు ఆరింటిని నిర్మించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక క్రమశిక్షణకు, మెరుగైన పనితీరుకు ప్రశంసాపూర్వకంగా ఆర్.ఇ.సి., పి.ఎఫ్.సి. లాంటి ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణంపై వడ్డీని 12 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గించాయి. దీనివల్ల ప్రతీ ఏటా విద్యుత్ సంస్థలకు 200 కోట్ల మేర వడ్డీ భారం తగ్గుతున్నది.
డిస్కమ్ లపై ఆర్థిక భారం తొలగించడానికి తెలంగాణ రాష్ట్రం ఉదయ్ పథకంలో చేరింది. డిస్కమ్ లకున్న 8,923 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వం భరిస్తున్నది. దీని ద్వారా డిస్కమ్ లు రుణవిముక్తి పొంది, మరింత స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యమవుతుంది. 
ఆర్థిక ప్రగతికి సూచికగా చెప్పబడే తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును మించింది. తెలంగాణ ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం ఏడాదికి 1,200 యూనిట్లుగా ఉంటే, ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగం 1,505 యూనిట్లకు పెరిగింది. మూడున్నరేళ్లలో తెలంగాణలో విద్యుత్ వినియోగం 26 శాతం పెరిగింది. 2016-17 సంవత్సరంలో జాతీయ సగటు 1,122 యూనిట్లయితే, తెలంగాణ సగటు అంతకన్నా 383 యూనిట్లు అదనంగా నమోదైంది. ఈ పెరుగుదల తెలంగాణ రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర ప్రజల మెరుగైన జీవన విధానానికి అద్దం పడుతున్నది.విద్యుత్ సంస్థలు బలోపేతమైతే, ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ ఉత్పత్తి జరిగితే రాష్ట్రంలోని పేదలకు మరిన్ని సబ్సిడీలు అందించవచ్చని ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తున్నది.. ప్రభుత్వం పేదలకు విద్యుత్ సబ్సిడీలు అందించడం కోసం బడ్జెట్లో 4,777 కోట్ల రూపాయలు కేటాయించింది.వ్యవసాయానికి 24 గంటల విద్యుత్  అందిస్తున్న శుభసందర్భంలో  ఆటో స్టార్టర్లను తొలగించుకోవాలనిముఖ్యమంత్రి  కే సి ఆర్ రైతాంగాన్న కోరారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 6574 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉంది. 2017 వచ్చేసరికి కొత్తగా 7981 మెగావాట్ల విద్యుత్ సమకూర్చుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14,555 మెగావాట్లు. మరో 13752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త ప్లాంట్ల నిర్మాణం సాగుతోంది. విద్యుత్ టారిఫ్‌ను 2015, 2016 సంవత్సరాల్లో పెంచారు. 2017లో విద్యుత్ చార్జీలను పెంచలేదు. ఇది కూడా ఒక రికార్డు. సామాన్యుడిపై భారం పడకుండా 2017లో కూడా దాదాపు రూ.5వేల కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించింది. సింగరేణి పవర్ ప్లాంట్ ద్వారా 1200 మెగావాట్లు, కెటిపిసిద ఆవరా 600 మెగావాట్లు, జూరాల ద్వారా 240 మెగావాట్లు, పులిచింతల ద్వారా 90 మెగావాట్లు, చత్తీస్‌గడ్ నుంచి వెయ్యి మెగావాట్లు, సిజిఎస్ ద్వారా రెండు వేల మెగావాట్లను అదనంగా సమకూర్చుకున్నారు. కొత్త సౌర విద్యుత్ పాలసీతో సౌర విద్యుత్ పారిశ్రామికవేత్తలు తెలంగాణకు క్యూ కట్టారు. కొత్తగా నిర్మించే ఎత్తిపోతల పథకాలకు 8500 మెగావాట్లు అవసరమవుతుంది. ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వేగవంతం చేశారు. 4వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్ల ద్వారా 1880 మెగావాట్ల విద్యుత్ వచ్చే ఏడాది అమలులోకి వస్తుంది. రామగుండం ఎన్టీపిసి ద్వారా మరో 1600 మెగావాట్ల విద్యుత్ లభ్యతలోకి రానుంది. 28వేల మెగావాట్లకు పైగా స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.12136 కోట్ల వ్యయంతో పంపిణీ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడే నాటికి 400 కెవి సబ్‌స్టేషన్లు ఆరు ఉంటే, కొత్తగా మరో ఐదు నిర్మించి వాటి సంఖ్యను 11కు చేర్చారు. 400 కెవి సబ్‌స్టేషన్లను మరో 5 నిర్మించేందుకు ప్రణాళికను ఖరారు చేశారు. 220 కెవి సబ్‌స్టేషన్లు 51 ఉంటే, కొత్తగా మరో 19 నిర్మించి వాటి సంఖ్యను 70కు పెంచారు. 132 కెవి సబ్‌స్టేషన్లు 51 ఉంటే, కొత్తగా మరో 19 నిర్మించి వాటి సంఖ్యను 211కు పెంచారు. 33 కెవి సబ్‌స్టేషన్లు 2181 ఉంటే కొత్తగా 515 నిర్మించి, వాటి సంఖ్యను 2696కు పెంచారు. రాష్ట్రంలో సబ్‌స్టేషన్ల సంఖ్యను 2414 నుంచి 2988కు పెంచారు. రాబోయే మూడు నాలుగేళ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు 42 వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా 18 వరకు 400 కెవి సబ్‌స్టేషన్లు, 220 కెవి సబ్‌స్టేషన్లను 34, 132 కెవి సబ్‌స్టేషన్లు 90, 33/11 కెవి సబ్‌స్టేషన్లు 937 నిర్మించేందుకు ప్రణాళికను ఖరారుచేశారు. హైటెన్షన్ సామర్థ్యాన్ని 12,653 మెగావాట్ల నుంచి 20,660 మెగావాట్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్రం చూపించిన చొరవ కారణంగా ఉత్తర, దక్షిణ గ్రిడ్‌ల మధ్య కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం జరిగింది. వార్దా-మహేశ్వరం వయా డిచ్‌పల్లి మధ్య 765 డబుల్ సర్క్యూట్ లైన్ నిర్మాణం పూర్తయింది. వరంగల్-వరోరా లైను మరో మూడేళ్లలో పూర్తవుతుంది. ఈ లైన్ల ద్వారా తెలంగాణ రాష్ట్రం మరో రెండు వేల మెగావాట్ల విద్యుత్ పొందేందుకు వీలుగా పిజిసిఐఎల్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ లైన్ల ద్వారా దేశంలో ఎక్కడినుంచైనా కావాల్సినంత విద్యుత్‌ను పొందే వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి కలిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేందుకు వీలుగా జిహెచ్‌ఎంసి చుట్టూ 142 కి.మీ మేర 400 కెవి రింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక క్రమశిక్షణకు మెరుగైన పనితీరును ఆర్‌ఇసి, పిఎఫ్‌సి సంస్థలు మెచ్చుకున్నాయి. ఈ సంస్థలు ఇచ్చే రుణాలపై వడ్డీని 12 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గించాయి. దీని వల్ల విద్యుత్ సంస్థలకు 200 కోట్ల రూపాయల మేర వడ్డీ భారం తగ్గింది. తెలంగాణ విద్యుత్ వినియోగం గత మూడున్నరేళ్లలో 26 శాతం పెరిగింది. 2016-17లో జాతీయ సగటు విద్యుత్ వినిమయం 1122 యూనిట్లు ఉంటే, తెలంగాణ సగటు అంతకన్నా 383 అదనంగా నమోదైంది. ఈ పెరుగుదల తెలంగాణ అభివృద్ధికి తార్కాణంగా భావించవచ్చు.సంపద సృష్టికి  కెసిఆర్ కొత్త నిర్వచనం ఇస్తున్నారు.ఆధునిక కాలంలో కూడా ప్రకృతి నుంచి సంపదను సృష్టించే సరికొత్త విధానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆవిష్కరిస్తున్నారు.   ఒకప్పుడు సంపదకే కాదు.. ఉపాధికి కూడా ప్రకృతిపైనే  మనుషులు ఆధారపడేవారు. వ్యవసాయం అభివృద్ధి చెందాక సాగు ద్వారా సంపద సృష్టికి మనిషి ప్రయత్నించాడు. అనంతరకాలంలో పరిశ్రమలు వృద్ది చెందాయి. వ్యవసా యంతో పోలిస్తే మరింత వేగంగా సంపద సృష్టికి మనిషి పరి శ్రమల్ని ఎంచుకున్నాడు. సరికొత్త పారిశ్రామిక విధానాలు అందుబాటులోకి రావడంతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటరీకరణ, అంతర్జా తీయ వాణిజ్యాల ద్వారా సంపద పెంచుకునే మార్గానికి శ్రీకారం చుట్టాడు. ఈ పరిణామ క్రమంలో సంపద సృష్టికి శాశ్వత వనరుల్ని ప్రసాదించిన ప్రకృతిని పక్కనపెట్టేశాడు. ఈ ఫలితం ఇప్పటికే సమాజమ్మీద ప్రభావం చూపింది. వ్యవస్థలో తీవ్ర అసమానతలు పొడసూపాయి. పెరిగిన సంపద కొన్ని వర్గాల వద్దే కేంద్రీకృతమైంది. కొన్ని కుటుంబాలకే పరి మితమైంది. నిరక్షరాస్యులు, వెనుకబడ్డ తరగతులు, జాతులు, గ్రామీణులు, లోతట్టు ప్రాంతాల నివాసితులు దారిద్య్రంలోనే మగ్గుతున్నారు. ప్రకృతి వనరుల్ని పక్కనపెట్టడంతో ఉపాధి అవకాశాలు కూడా సన్నగిల్లాయి. దీన్ని తొలిసారిగా గుర్తిం చింది ముఖ్యమంత్రి కెసిఆరే. ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సద్వినియోగం చేసుకో వడం ద్వారా ఉపాధిని పెంచడంతో పాటు సంపద వృద్దికి శ్రీకారం చుట్టవచ్చునని  ఆయన గుర్తించారు.ఉప్పూ, పప్పు వలె కరెంటు కూడా సమస్త ప్రజానీకానికి  ఇప్పుడు నిత్యావసర  సరకు అయ్యింది. దీన్ని జాగ్రత్తగా సమర్ధంగా వాడుకోవలసి ఉన్నది. మిగులు విద్యుత్ రాష్ట్రం గా తెలంగాణను నమోదు చేసిన సి.ఎం కెసిఆర్ కే సి ఆర్ చిత్తశుద్ధి తో వేస్తున్నఅడుగులు బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువేడుతున్నవి.గతంలో  చానక్యమూ, చాకచక్యమూ, చేతకాని తనవ్యక్తిత్వం ఉండడం, పటేల్ తనం తో పాటు ఎడ్డితనం ఉండడం , దొరతనంతో పాటు ప్రపంచం తెలియని అజ్ఞానం తెలంగాణ  నాయకత్వానికి ఉండేవి. కేసిఆర్ అందుకు పూర్తిగా భిన్నం.ఉద్యమ నాయకుడే కాకుండా స్వతహాగా సృజనాత్మకంగా ఆలోచించడం.,ప్రణాళికా బద్ధంగా పాలించడం వవల్లనే ఇన్ని విజయాలు తెలంగాణఖాతాలో పడుతున్నవి.  రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే “ ఉండనే ఉండదన్న పరిస్తితి నుంచి పోనే పోదు “ అనే పరిస్థితికి తెలంగాణాలో విద్యుత్తు సరఫరా చేరుకున్నది.

Related Posts