- పిరికితనంతో ఆత్మహత్య చేసుకున్న విష్ణుప్రియ
కర్నూలులోని మెడికల్ కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విష్ణుప్రియ (22) తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన విష్ణుప్రియ ఏ.క్యాంప్ బృందావన్ హైట్స్ బంధువుల ఇంట్లో ఉండి పీజీ చేస్తోంది. మంగళవారం తన పడక గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన బంధువులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్య విషయం పోలీసులకు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు పోలీసులకు తెలిసి రంగప్రవేశం చేశారు.అయినా పోస్టుమార్టం వద్దంటూ అడ్డుపడ్డారు. విష్ణుప్రియ దగ్గర పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. సూసైడ్ నోట్‌లో తాను జీవితంలో ఓడిపోయానని, పిరికితనంతో చనిపోతున్నాని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని ఉంది. యువతి మృతదేహం ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలోనే ఉంచారు. నేటి ఉదయం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తామని పోలీసులు తెలిపారు.