ఇస్రో మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రయోగాత్మకంగా నిర్వహించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒకవేళ వ్యోమగాములను నింగిలోకి పంపిస్తే, ఆ వ్యోమగాములు సురక్షితంగా బయటపడే విధానాన్ని ఈ పరీక్ష ద్వారా నిర్వహించారు. మానవ సహిత ప్రయోగాలు చేపట్టాలనుకుంటున్న ఇస్రో .. అత్యంత సంక్లిష్టమైన ఈ సాంకేతిక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. వ్యోమనౌకలో సిబ్బంది ఉండే క్రూ మాడ్యూల్‌ను నౌక నుంచి వేరు చేయాలనుకుంటే.. ఆ ప్రక్రియను ఎలా వేగంగా నిర్వహించాలో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ పరీక్ష ద్వారా చేపట్టారు. దీని వల్ల వ్యోమగాములు సురక్షితంగా ప్రాణాలతో బయటపడే ఛాన్సుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఈ పరీక్షను ఇవాళ నిర్వహించారు. ప్యాడ్ అబార్ట్ టెస్ట్ పేరుతో దీన్ని చేపట్టారు. ల్యాంచ్ ప్యాడ్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ సమయంలో వ్యోమగాములు సురక్షితంగా బయటపడే ప్రక్రియను క్రూ ఎస్కేప్ సిస్టమ్ ద్వారా పరీక్షించారు. ఉదయం 7 గంటలకు ఈ పరీక్షను నిర్వహించారు. అయిదు గంటల పాటు నిర్వహించిన కౌంట్‌డౌన్ తర్వాత క్రూ ఎస్కేప్ సిస్టమ్ మాడ్యుల్ గాలిలోకి ఎగిరింది. ఈ మాడ్యూల్ సుమారు 12.6 టన్నుల బరువుంది. కేవలం 259 సెకన్లలో పరీక్షను పూర్తి చేశారు. బంగాళా ఖాతం సముద్రంలో ఎగిరిన క్రూ మాడ్యుల్ నుంచి ప్యారాచూట్లు వేరుపడ్డాయి. శ్రీహరికోటకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రక్రియ జరిగింది. సుమారు 300 సెన్సార్లు మొత్తం ఈ ప్రక్రియను రికార్డు చేశాయి. మాడ్యూల్ శిథిలాలను తీసుకువచ్చేందుకు మూడు బోట్లను పంపారు.