ఒక పక్క కంపెనీల ప్రారంభోత్సవాలు.. మరో పక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవాలు.. మరో పక్క పేదల ఇళ్ళ ప్రారంభోత్సవాలు.. ఇలా సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం అన్నీ దూసుకుపోతున్నాయి. మూడు లక్షల ఇళ్ళ గృహప్రవేశాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ నెల 11న మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల పదకొండున వంద అన్న క్యాంటీన్ లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 50వేల జనాభా పైబడిన అన్ని పట్టణ ప్రాంతాల్లో 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా తొలిదశలో 100 అన్న క్యాంటీన్లు ఈ నెల 11న ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. మిగిలిన వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.203 క్యాంటీన్ల ఏర్పాటుకు బడ్జెట్లో రూ. 200 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది. ఒక్కొక్క క్యాంటీన్ ఏర్పాటుకు రూ. 36 లక్షలను మంజూరు చేసింది. క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలాల కొరత ఉండటంతో అన్నింటినీ ప్రారంభించడం సాధ్యం కాలేదు. అందుబాటులో ఉన్న 100 ప్రాంతాల్లో ఇప్పటికే పనులు పూర్తవుతున్నాయి. ఈ మేరకు విజయవాడ, గుంటూరులో ఇప్పటికే రెండు క్యాంటీన్లను పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ 100 క్యాంటీన్లు వారంలో ఆరు రోజులపాటు నిరుపేదలకు ఆహారాన్ని అందిస్తాయి. అయితే ఆదివారం మాత్రం వీటికి సెలవుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి కలిపి మొత్తం రూ.15లు ఒక్కరి నుంచి వసూలు చేస్తారు. అంటే పూటకు రూ.5లు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.ఈ ఒక్కొక్క క్యాంటీన్లలో ఉదయం 300 మందికి టిఫిన్, మధ్యా హ్న భోజనం 360 మందికి, రాత్రి భోజనం 240 మందికి అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్యాంటీన్ల ప్రారంభం అనంతరం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అవసరాన్ని బట్టి వీటిని మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆహారం ఇలా... వారంలో 6 రోజులపాటు పనిచేసే అన్న క్యాంటీన్లల్లో అందించే ఆహార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సోమవారం అల్పాహారంగా ఇడ్లీ లేదా పూరి, మంగళవారం ఇడ్లీ, ఉప్మా, బుధవారం ఇడ్లీ, పొంగలి, గురువారం ఇడ్లీ, హరి, శుక్రవారం ఇడ్లీ, ఉప్మా, శనివారం ఇడ్లీ, పొంగలి అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్లేటుకు మూడు ఇడ్లీ లేదా మూడు పూరి, అదే విధంగా ఉప్మా, పొంగలి 200 గ్రాములు ఇస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజునంలో అన్నంతో పాటు ఒక కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చ డి అందించనున్నారు. మధ్నాహ్నం, రాత్రి భోజనంలో అన్నం 400 గ్రాములు, కూర 100 గ్రాములు, సాంబారు 120 గ్రాములు, పెరుగు 75 గ్రాములు అందించనున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ క్యాంటీన్లు ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు, అదే విధంగా రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేస్తాయి.