తెలుగుదేశం పార్టీ బిజెపి తో కలిసి ఉన్నన్ని రోజులూ ఆయనే ఢిల్లీ నుంచి గల్లీ వరకు చక్రం తిప్పేవారు. సుమారు నాలుగేళ్ల పాటు కేంద్రమంత్రి హోదాలో ఒక వెలుగు వెలిగారు. ఢిల్లీ లో ఆయన చెప్పిందే శాసనంగా నడిచేది. సదరు మంత్రిపై ఎన్నో ఆరోపణలు ఆయన పదవి చేపట్టక ముందూ, చేపట్టిన తరువాతా వెల్లువెత్తాయి. అయినా చంద్రబాబు ఆయనకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. పోలవరం, ఏపీ రాజధానిపై తరచూ ఆ టీడీపీ మంత్రివర్యులు వివరణలు ఇస్తూ ఉండేవారు. కట్ చేస్తే తాజాగా ఆయన సీన్ రివర్స్ అయ్యింది. ఢిల్లీ రాజకీయాల్లో టీడీపీకి కర్త కర్మ క్రియ సుజనా చౌదరి. బాబుకి అత్యంత ఇష్టమైన సుజన ఎన్డీయే నుంచి టిడిపి ఇలా బయటకు వచ్చిందో లేదో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. చురుకైన నేతగా పేరున్న ఆయన ఎందుకిలా చేస్తున్నారు అనే కోణంలో చర్చ నడుస్తుంది. సుజనాచౌదరి పై ఆరోపణలు, విమర్శలు ఉన్న నేపథ్యంలో కేంద్రం విచారణకు ఆదేశిస్తే ముందుగా బుక్ అయ్యేది సుజననే అన్న టాక్ వచ్చేసింది. దాంతో ఎందుకైనా మంచిదని టిడిపి కార్యక్రమాలకు ఆయన దూరంగానే ఉంటూ వస్తున్నారు. అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ కడప, విశాఖలో పార్టీ నేతలు తలపెట్టిన దీక్షల్లో ఆయన పాత్ర నామమాత్రం అయిపొయింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.