పాలనపైనా, తన ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహార శైలిపైనా నిత్యం సర్వేలు చేయించుకుని, నివేదికలు తెప్పించుకునే సీఎం చంద్రబాబుకు తాజాగా ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి ఓ నివేదిక వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణం, ప్రత్యేక హోదా ఇవ్వని నేపథ్యంలో నిర్‌చహించిన ఈ కీలకమైన సర్వే ఫలితాలు చూశాక చంద్రబాబుకు దిమ్మతిరిగిపోయింది. ఇంటిలిజెన్స్ అధికారులు చంద్రబాబుకు ఇచ్చిన తాజా సర్వేపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి ఇంతకీ అధికారులు చంద్రబాబుకు ఇచ్చిన నివేదిక ఏంటీ ? దాని సారాంశం ఏంటీ? అనేది రాష్ట్రంలో ఆసక్తిగా మారింది. వాస్తవానికి చంద్రబాబు నెలకు రెండు దఫాలుగా సర్వే చేయించుకుంటున్నారు. కానీ, తాజాగా చేసిన సర్వే, దాని తాలూకు ఫలితాలు ఆయనను తీవ్రంగా కలవరపాటుకు గురి చేశాయన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ సర్వే ఫలితాలు అధికార పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.రాష్ట్రంలో తాను ఎంతో తిరిగి పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాల పై ప్రచారం చేస్తున్నా.. తాజాగా వచ్చిన సర్వే ఫలితాలు రివర్స్ లో ఉండడంతో బాబు ఆశ్చర్యపోయారు. దీంతో ఒక్కసారిగా ఆయన తమ్ముళ్లను అమరావతికి పిలిచి క్లాస్ పీకారు నివేదిక ప్రకారం అధికార టీడీపీపై ప్రజల్లో నమ్మకం లేదని, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి అందచేశారు. ఏ ఒక్క పనీ కావడం లేదని, కొద్దిపాటి సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా అధికార పార్టీ నేతలు చెప్పినవారికే దక్కుతున్నాయని ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారని సర్వేలో వెల్లడైంది. ప్రజలు చెబుతున్న సమస్యలు ఏమిటి? వాటి ద్వారా ఖజానాపై పడే ఆర్థిక భారం ఎంత? అనే వివరాలను కూడా ఇంటెలిజెన్స్ నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. తద్వారా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, రాజధాని నిర్మాణం లాంటి హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చి తాత్కాలిక చర్యలతో వ్యతిరేకత తగ్గించుకోవాలనే దిశగా టీడీపీ సర్కారు పావులు కదుపుతోంది.ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా గతంలో కూడా ప్రభుత్వం సర్వే నిర్వహించింది. పింఛను వస్తోందా? రేషన్‌కార్డు ఉందా? బూత్ స్థాయిలో బలమైన నాయకులు ఎవరు? వారిని ప్రభావితం చేసే వారు ఎవరు? లాంటి అంశాలతో సర్వే చేపట్టింది. దీనికోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా రెండు నెలల పాటు ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఇప్పుడు మరోసారి 66 ప్రశ్నలతో రాజకీయ కోణంలో సర్వే చేయడం, అందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించి నివేదికలు తెప్పించింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా పెద్దగా భారం పడని సమస్యలను గుర్తించి తాత్కాలికంగా ఉపశమనం కలిగించే చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమైంది. మండలాల్లో ఈ సర్వేను ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్వహిస్తున్నాయి. మండలానికి ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వే వివరాలను నియోజకవర్గ స్థాయిలో ఒక ఎస్‌ఐ ర్యాంకు అధికారి క్రోడీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫలితాలను తెలుసుకున్న చంద్రబాబు నివ్వెరపోయినట్టు సీఎంవో వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. ఈ సర్వే ఫలితాల తర్వాత నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న వారిని బాబు నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసేలా సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది.