- సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు నూతన సీఎస్ ఎస్కే జోషీ
చిన్నతనంలో హైదరాబాద్ చూడాలని తనకు కోరిక ఉండేదని, అలాంటిది హైదరాబాద్‌లోనే సీఎస్‌గా పనిచేసే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని తెలంగాణ నూతన సీఎస్ ఎస్కే జోషీ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన బాధ్యతలను పూర్తి చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని తెలంగాణ నూతన సీఎస్ ఎస్కే జోషీ అన్నారు. తనను సీఎస్‌గా నియమించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీం వర్క్‌తో కష్టపడి పనిచేస్తానన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయనున్నట్టు చెప్పారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసేందుకు కృషిచేస్తానని స్పష్టంచేశారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగకుండా పనిచేస్తామని తెలిపారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న జోషీకి పలువురు ఐఏఎస్‌లు, అధికారులు అభినందనలు తెలిపారు.