YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైతన్నకు అందని రాయితీ

 రైతన్నకు అందని రాయితీ
కూరగాయల రైతులకు ఇవ్వాల్సిన రాయితీ సొమ్ము నాలుగు నెలలుగా ఖజనాలో మూలుగుతోంది. ఫలితంగా పెట్టుబడికి స్థోమత చాలక రైతులు ఈ వేసవిలో కూరగాయల సాగు చేపట్టలేకపోయారు. గతేడాది లక్ష్యం ఇంకా 25 శాతం పెండింగ్‌లో ఉండగా.. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి ఇంతవరకు రాయితీ పథకాలు ప్రారంభించకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
అధిక ధర పలికే కూరగాయలు, పూల సాగును రక్షిత సేద్యం ద్వారా ఉద్యానశాఖ ప్రోత్సహిస్తోంది. కొద్ది కొద్ది విస్తీర్ణంలో కూరగాయల సాగు చేపట్టే రైతులకు రాయితీ వర్తింపజేస్తోంది. అధిక విలువ కలిగిన కూరగాయలను పండించేందుకు షేడ్‌ నెట్‌, పాలిహౌస్‌ల ఏర్పాటుకు ఆర్‌కేవీవై, ఎంఐడీహెచ్‌ పథకాల కింద యూనిట్‌ విలువలో 50% రాయితీ ఇస్తోంది. 2017-18కి 13 జిల్లాల్లో 210 ఎకరాల్లో హై వాల్యూ వెజిటబుల్స్‌ పండించాలని అధికారులు నిర్దేశించారు. గతేడాది ఈ పథకం కింద రూ.37 కోట్లు మంజూరయ్యాయి. అందులో 75% రాయితీ పంపిణీ చేశారు. మిగిలిన 25% విడుదలలో తాత్సారం చేశారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సమగ్ర ఆర్ధిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) సాఫ్ట్‌వేర్‌ను రాయితీ పథకాలకు అనుసంధానం చేయడంతో మరింత జాప్యం చోటు చేసుకుందని ఉద్యానశాఖాధికారులు చెబుతున్నారు.
ఆర్‌కేవీవై, ఎంఐడీహెచ్‌ పథకాల కింద షేడ్‌ నెట్‌, పాలిహౌస్‌ల ఏర్పాటుకు 2018-19 బడ్జెట్‌లో రూ.53కోట్లు విడుదలయ్యాయి. ఈ ఏడాది 360 ఎకరాల్లో కూరగాయల సాగు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ పథకం కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి నారు, పశ్చిమగోదావరి జిల్లాలో క్యాప్సికం, తూర్పుగోదావరి జిల్లాలో పూల మొక్కల పెంపకం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టమాటాతో పాటు ఇతర విలువ కలిగిన కూరగాయల సాగు చేస్తున్నారు. అర్హత కలిగిన రైతులు షేడ్‌ నెట్స్‌, పాలి హౌస్‌ కోసం దరఖాస్తులు చేసుకుంటే మంజూరు చేస్తారు.
షేడ్‌నెట్లకు రూ.28లక్షలు, పాలీహౌస్‌లకు రూ.33లక్షలు మంజూరు చేసి, 50% రాయితీ వర్తింపజేయనున్నారు. ఉద్యానశాఖ గుర్తించిన ఫ్యాబ్రికేట్స్‌ పరికరాలను తెచ్చి రైతులు ఎంపిక చేసుకున్న పొలాల్లో షేడ్‌ నెట్స్‌, పాలి హౌస్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో పెంచే నారును ఇతర రైతులకు అమ్ముతారు. పూలు, కూరగాయలు ఎగుమతి చేస్తారు. దీంతో డిమాండ్‌కు తగ్గట్టు పంట ఉత్పత్తి మార్కెట్‌లోకి వస్తుంది. ఫలితంగా ధరలు అందుబాటులో ఉండేందుకు అవకాశముంటుంది.
ఇందుకోసం ప్రభుత్వం రాయితీలిచ్చి కూరగాయల సాగును ప్రోత్సహిస్తోంది. ఈ విధంగా కూరగాయల సాగు చేసే రైతులు మిగిలిన సొమ్ముకోసం 60% బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్నారు. 40% మంది సొంత డబ్బుతో చేస్తున్నారు. కానీ ఈసారి రాయితీల విడుదలలో జాప్యంతో రైతులు ఉసూరుమంటున్నారు. రాయితీల చెల్లింపుల విషయంలో సీఎఫ్‌ఎంఎస్‌ పక్కాగా అమలు చేస్తుండగా, సీఎఫ్‌ఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేయడం, పథకాలను అప్‌డేట్‌ చేయడం, డేటా ఫార్వర్డ్‌ చేయడంలో జాప్యం జరిగి రైతులకు రాయితీ అందించలేకపోయినట్లు ఉద్యానశాఖ అధికారి ఒకరు చెప్పారు.

Related Posts