భారత మాజీ ఉపప్రధాని స్వర్గీయ బాబూ జగజ్జీవన్ రామ్ భవనాన్ని ఏలూరులో నిర్మించడానికి తగు నిధులు కేటాయిస్తానని ఎంపి మాగంటి బాబు చెప్పారు. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ ఓవర్ బ్రిడ్జి వద్ద జగజ్జివన్ 32వ వర్థంతి సందర్భంగా జగజ్జీవన్ రామ్ కాంశ్య విగ్రహానికి ఏలూరు ఎంపి, శాసనసభ్యులు బడేటి బుజ్జి శుక్రవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ ఏలూరులో అంబేద్కర్ భవన్ మాదిరిగా జగజ్జీవన్ భవన్ ఏర్పాటుకు స్థలాన్ని సిద్దం చేస్తే భవన నిర్మాణానికి ఎంపి నిధులనుండి సొమ్ము కేటాయిస్తానని చెప్పారు. బాబూ జగజ్జీవన్ రామ్ రక్షణశాఖ మంత్రిగా, దేశానికి చేసిన సేవలు మరువలేనివని దళితజాతి ఉద్దరణకు ఎంతో శ్రమించారని అటువంటి మహానుబావుని భావితరాలు కూడా గుర్తుపెట్టుకోవాలని మాగంటి బాబు కోరారు. శాసనసభ్యులు బడేటి బుజ్జి మాట్లాడుతూ సమాజంలో పేదరిక నిర్మూలన కోసం ఎంతో శ్రమించిన బాబూ జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత అన్ని రంగాలలో ముందుకు సాగాలని కోరారు. ఆధునిక యుగంలో కులమతాలకు తావులేదని, పేదరికంలో వున్న వారి జీవితాలను తీర్చిదిద్దేందుకు చంద్రబాబు 111 పధకాలు ప్రవేశపెట్టారని వాటి ఫలాలు పేదలకు అందిస్తే ఆర్థిక అసమానతలు లేని సమాజం ఆవిర్బవిస్తుందని బుజ్జి చెప్పారు. ఎంఎల్‌సి రాము సూర్యారావు మాట్లాడుతూ 25 ఏళ్ల నుండి ఏలూరులో బాబూ జగజ్జీవన్ రామ్ కాంశ్య విగ్రహాన్ని స్థాపించాలన్న దళితుల కోర్కెను తీర్చడానికి బడేటి బుజ్జి స్వంతనిధులు వెచ్చించి ఇక్కడ కాంశ్య విగ్రహం స్థాపించడం దళితులపట్ల బడేటికి వున్న చిత్తశుద్దికి నిదర్శనమని చెప్పారు. ఈకార్యక్రమంలో దళితనేతలు పొలిమేర హరికృష్ట, పెరిగే వరప్రసాద్, బయ్యారపు రాజేశ్వరరావు, డా .ఎజె ప్రసాద్, కలపాల రవి, జింజు మోజెస్, జిజ్జువరపు ప్రసాద్, పెనుమలూరి మల్లి, మరకాల మస్తాన్, కార్పొరేటర్ రాయి విమలాదేవి, బిసి రాష్ట్ర సంఘ నాయకురాలు ఘంటసాల మహాలక్ష్మి, దేవరకొండ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.