ప్రధాని మోదీ 14 వ్యవసాయ పంటలకు మద్దతు ధర ప్రకటించటంపట్ల బీజేపీ ముఖ్యనేత మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. వరి పంటకు 200 మద్దతు ధర ప్రకటించటం వల్ల ఎకరాకు కనీసం 6 వేల నుంచి 8 వేల లాభం రైతుకు చేకూరుతుందని ఆయన అన్నారు. జులై మొదటివారం లో మద్దతు ధర ప్రకటించటం వలన రైతులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపశమనం లభిస్తుందని.. పంట కొనుగోలు భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడకుండా కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది అని మీడియా తో అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయటమే బీజేపీ లక్ష్యం అని కృష్ణంరాజు చెప్పారు. గతంలో తాను చెప్పిన విధంగానే రైతులకు మద్దతు ధర ప్రకటించటం పట్ల మోడీ కి కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. 33 సంవత్సరాలుగా ఇంత పెద్ద మొత్తం లో మద్దతు ధర పెరగలేదని.. బీజేపీ రైతు పక్షపాతి అనడానికి ఇదే నిదర్శనం అన్నారు . బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంధించిన 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ మీద ఉందన్నారు. భౌతిక దాడులు చేయటం ద్వారా టీడీపీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందన్నారు. ప్రజలు టీడీపీ చర్యలను గమనిస్తున్నారు.. సమయం వచ్చినప్పుడు వారే సమాధానం చెప్తాని కృష్ణం రాజు అన్నారు.