వైసీపీ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తోంది. 2014 ఎన్నికల్లో చేసిన పొరపాట్లను ఈ సారి పునరావృత్తం కాకుండా చూసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా తమ బలాబలాను బట్టి వచ్చే ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది ఆ పార్టీ అధిష్టానం. కచ్చితంగా గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని, అందుకోసం సర్వేలు కూడా చేయించింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేసే బాధ్యతను పార్టీలోని కొంతమంది సీనియర్లకు అప్పగించాడు వైఎస్ జగన్. ఈసారి ఎలాగైనా సీఎం అవ్వాలని అనుకుంటున్న జగన్.. దానికోసం ఎంతో కృషి చేస్తున్నాడు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన పలువురు టీడీపీలో చేరిపోవడంతో.. ఈ సారి నమ్మకస్తులకే టికెట్లు ఇవ్వాలని వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ సమయంలోనే వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలబోతుందట. వైసీపీకి చెందినకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారనే వార్త బయటికొచ్చింది. వాళ్లిద్దరూ కొద్దిరోజుల్లో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.కడప ఎమ్మెల్యే అమ్జద్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా త్వరలో సైకిల్ ఎక్కబోతున్నారని తెలుస్తోంది. వీళ్లిద్దరూ ముస్లిం సామాజిక వర్గానికే చెందిన వారు కావడం విశేషం. గత ఎన్నికల్లో వైసీపీ వెంట ఉన్న ముస్లిం, మైనారిటీల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వల్ల ఆ సామాజిక వర్గం టీడీపీ వైపు చూస్తోందని, అందుకే వీళ్లు కూడా తమ మనుగడ కోసం ఆలోచిస్తున్నారని, ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీళ్లను టీడీపీలోకి తీసుకురావడం వెనుక, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఓ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్కరు కూడా గెలవలేదు. వైసీపీ తరపున గెలిచిని జలీల్ ఖాన్, చాంద్ బాషా టీడీపీలో చేరారు. ఇప్పుడు వీరిద్దరు కూడా చేరితే టీడీపీలో ముస్లిం, మైనారిటీ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరుకుంటుంది. త్వరలోనే చంద్రబాబు.. ఓ ముస్లిం నేతకు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్త బయటికి రావడం ఆసక్తికరంగా మారింది.