జమ్మూ కశ్మీర్‌లో అల్లరి మూకలు మరోసారి సైన్యంపైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. కుల్గాంలోని రెద్వానీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తోన్న భద్రతా బలగాలపై పలువురు ఆందోళనకారులు శనివారం నాడు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైన్యం ప్రయత్నించింది. అయినా సరే వారు వెనక్కు తగ్గకపోవడంతో అదుపు చేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ పదహారేళ్ల అమ్మాయితో సహా ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది గాయపడ్డారు. ఇద్దరికి బుల్లెట్లు గాయాలవగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతిచెందిన వారిని హవురా గ్రామానికి చెందిన షకీర్ అహ్మద్ (22), ఇర్షాద్ మజిద్ (20), యువతి అంద్లేబ్‌గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ముందస్తు చర్యల్లో భాగంగా కుల్గాం, అనంత్‌నాగ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందుబాటులోకి రాలేదని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. గృహనిర్భంధంలో ఉన్న హురియత్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత మిర్వాజ్ ఉమర్ ఈ ఘటనపై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. ఆందోళనకారులపై సైన్యం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి, నరమేధానికి పాల్పడ్డారని ట్వీట్ చేశారు. రెద్వానీ ఘటన తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేయడంతో పలు ప్రాంతాల్లోని ఆందోళనకారులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలియజేశారు. ఆదివారం నాడు (జులై 8 న) హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ రెండో వర్ధంతి సందర్భంగా కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగకుండా పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, నౌహట్టా, మైసుమా పరిధిలో ఈ ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రజలు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సైన్యం హెచ్చరించింది.