సునందా పుష్కర్ మృతికేసులో శశిథరూర్‌కు బెయిల్ లభించింది. కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ పాటియాలా కోర్టు శనివారం తెలిపింది. రెండు రోజుల క్రితం ఆయనకు ఇదే కేసులో ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా ఆయన శనివారం కోర్టుకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. కోర్టు పంపిన సమన్లకు స్పందిస్తూ.. శశిథరూర్ కోర్టుకు హాజరైనట్లు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ తెలిపారు. సెషన్స్ కోర్టు ఆయనకు ముందే బెయిల్ మంజూరు చేసిందని, బెయిల్ బాండ్లను స్వీకరించినట్లు మెజిస్ట్రేట్ వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణ జులై 26కు వాయిదా పడింది. భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు శశిథరూర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఐపీసీలోని సెక్షన్ 498ఏ, 306 కింద శశిపై కేసులను నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన 3వేల పేజీల చార్జిషీటును విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు.. జులై 7న కోర్టుకు రావాల్సిందిగా థరూర్‌కు సమన్లు జారీ చేసింది. థరూర్‌పై విచారణ జరపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్ముతున్నట్లు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ చెప్పారు. సునంధను ఆత్మహత్యకు ప్రేరేపించడం, అనారోగ్యంతో ఉన్న భార్య పట్ల అమానుషంగా వ్యవహరించినట్లు థరూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. కాగా, బుధవారం శశిథరూర్ అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోరడంతో గురువారం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శనివారం ఆయనకు రెగ్యులర్ బెయిల్‌ను కూడా కోర్టు మంజూరు చేసింది.