రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతల రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు.ఈ ఈ మేరకు ట్విటర్‌లో కేటీఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రుణ మాఫీ చెల్లింపులపై కాంగ్రెస్ నేతలు చేస్తోన్న విమర్శలు సరికాదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఒకే విడత రుణ మాఫీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ తరహాలోనే 4 విడతల రుణమాఫీని కర్ణాటక ప్రకటించిందని తెలిపారు.కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటకలో 4 విడతల రుణమాఫీని అమలు చేస్తోందని.. అయితే ఇక్కడి కాంగ్రెస్ నేతలు మాత్రం తెలంగాణలో ఒకే విడత రుణమాఫీ కావాలని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఒకే విడత రుణమాఫీ కావాలన్న కాంగ్రెస్ నేతలు కర్ణాటకలో ఎందుకు ఆ విధంగా చేయడం లేదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతల రెండు నాల్కల ధోరణి సబబేనా అని అడిగారు.