రహదారి నిబంధనల సడలింపుతో మద్యం దుకాణాలను మార్చేందుకు లైసెన్సుదారులు ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నిబంధనల విషయంలో న్యాయస్థానం కొన్ని సడలింపులు ఇచ్చింది. దీనికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ దుకాణాల మార్పు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రహదారులకు దూరంగా మారిన దుకాణాలను మళ్లీ రోడ్డు సమీపంలో ప్రారంభించేందుకు దరఖాస్తు చేస్తున్నారు. వీటిని అనుమతించే విషయంలో ఎక్సైజ్ శాఖ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు దూరంగా వెళ్లడం వల్ల ఆదాయం కోల్పోవడంతో కొత్త ఆదేశాలతో ప్రధాన రాహదారుల సమీపంలోకి వస్తున్నారు. ఎక్సైజ్ శాఖ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.
దరఖాస్తులను అనుమతిస్తే మళ్లీ నివాసాల మధ్యలోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మళ్లీ లేనిపోని సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నారు. ఇటీవలి వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనావాసాల నుంచి తరలించాలని పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇప్పటివరకు జిల్లాలో స్థలాల మార్పిడికి సంబంధించి సుమారు 35 దరఖాస్తుల వరకు వచ్చినట్లు సమాచారం.
కృష్ణా జిల్లాలో మొత్తం మద్యం దుకాణాలు 336, బార్లు 158 ఉన్నాయి. వీటిలో విజయవాడ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో 164, మచిలీపట్నం యూనిట్‌లో 172 ఉన్నాయి. విజయవాడ ఈఎస్ పరిధిలో బార్లు 134, బందరు పరిధిలో 24 ఉన్నాయి. గత ఏడాది దుకాణాల కేటాయింపు జరిగిన సమయంలో సుప్రీం కోర్టు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరానికి వెళ్లాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దీంతో జాతీయ రహదారుల సమీపంలోని 145 దుకాణాలు, 46 బార్లు దూరంగా వెళ్లాల్సి వచ్చింది. రాష్ట్ర రహదారుల సమీపంలో ఉన్న 120 దుకాణాలు, 48 బార్లు దూరంగా వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో మద్యం అమ్మకాలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం తెచ్చిన నిబంధన వల్ల వ్యాపారులకు కొంత ఊరట లభించింది.
నగర, పట్టణ, మండల కేంద్రాల నుంచి వెళ్లే రాహదారులను స్థానిక రోడ్లగానే పరిగణిస్తూ ఆదేశాలిచ్చింది. దీని వల్ల ఈ ప్రాంతాల్లోని దుకాణాల నిబంధనను సడలించడంతో 220 మీటర్లలోనే ఏర్పాటు చేసుకునే వెసులుబాటు లభించింది. పల్లెల విషయంలో మాత్రం మార్చలేదు. దీనికి సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు నిబంధనలు సడలిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గత నెలలో పల్లెల్లోనూ జాతీయ, రాష్ట్ర రహదారుల నిబంధనలకు సంబంధించి ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు.
దీని ప్రకారం గ్రామాల్లోని రహదారుల సమీపంలోకి మార్చుకునే వెసులుబాటు లైసెన్సుదారులకు కలిగింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలువురు తమ దుకాణాలను మార్చుకునేందుకు దరఖాస్తు చేస్తున్నారు. దూరంగా ఉండటంతో తాము భారీగా ఆదాయం కోల్పోయామని, మార్పునకు అంగీకరించమని అభ్యర్థిస్తున్నారు. విజయవాడ ఈఎస్ పరిధిలో ఇప్పటివరకు 20 వరకు, మచిలీపట్నం కార్యాలయం పరిధిలో 15 మంది వరకు దరఖాస్తు చేశారు. ఉయ్యూరు, కైకలూరు, మండవల్లి, మొవ్వ, అవనిగడ్డ, మచిలీపట్నం ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఇవి ఉన్నాయి.
వచ్చిన విజ్ఞప్తులను అంగీకరించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దరఖాస్తులను అనుమతిస్తే గతంలోవలె ఇళ్ల మధ్యలోకి వచ్చే అవకాశం ఉంది. మళ్లీ ఆందోళనలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడిప్పుడే వివాదాలు సద్దుమణిగాయి. వీటిపై త్వరగా నిర్ణయం తీసుకోవడం లేదు. పోలీసు, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకోమని మెలిక పెడుతున్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే కొత్త ఎక్సైజ్ సంవత్సరం నుంచి అమలు చేస్తే సమస్యలను తప్పించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారించి ఎక్కడా అభ్యంతరాలు రాని చోట, సమస్యలు ఉత్పన్నం కావని భావించిన చోట మాత్రమే అంగీకరించే యోచనలో ఉన్నారు. ఇటువంటి వాటినే కమిషనర్ కార్యాలయానికి పంపుతున్నారు.