YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

వేదవతి వేదన.. (అనంతపురం)

వేదవతి వేదన.. (అనంతపురం)
గుమ్మఘట్ట మండలంలోని భైరవానితిప్ప జలాశయానికి నీరు రాకుండా ఎగువ ప్రాంతంలో కర్ణాటక ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు చేపడుతోంది. రూ.కోట్లు ఖర్చు చేసి చెక్‌డ్యామ్‌లు, బ్యారేజీలు నిర్మించి, అక్కడి చెరువులు, కుంటలకు నీటిని తరలించేస్తున్నారు. తాజాగా మరో రెండు చెక్‌డ్యామ్‌లు, ఒక బ్యారేజీ నిర్మాణ పనులను చేపట్టారు. ఇవి పూర్తయితే బీటీపీకి నీరు పూర్తిగా నిలిచిపోనుంది. ఫలితంగా జిల్లా ఆయకట్టు బీళ్లుగా మారే పరిస్థితి ఉంది.
 
జిల్లాలోని గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో 2.6 టీఎంసీల నీటి సామర్థ్యంతో 1954లో వేదవతి నదిపై భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)ను నిర్మించారు. దీని పరిధిలో 12,400 ఎకరాల ఆయకట్టు ఉంది. రొటేషన్‌ పద్ధతిలో 14 డిస్ట్రిబ్యూటర్లకు నీటిని అందించే వారు. దీంతో ఖరీఫ్‌, రబీ సీజన్లలో వరి, వేరుసెనగ పంటలు సాగయ్యేవి. అయితే నదీ  పరివాహక ప్రాంతం ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలోనే ఉంది. అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో బీటీపీకి వరద నీరు వచ్చే అవకాశం సన్నగిల్లుతోంది.
 
కర్ణాటక రాష్ట్రంలోని వేదవతి నది నుంచి బీటీపీకి వెళ్లే నీటికి అడ్డుకట్ట వేయకూడదని బచావత్‌, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునళ్లు అప్పట్లోనే తీర్పునిచ్చాయి. కానీ కర్ణాటక ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నదిపై బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించింది. హిరియూరు తాలూకాలోని ఆలూరు వద్ద రెండు భారీ చెక్‌డ్యామ్‌లు, శెటగొంభే వద్ద ఒకటి, ధర్మపురి వద్ద, జాజరకుంట, శిడ్లాయన కోటే పిట్లల్లి తదితర ప్రాంతాల్లో భారీ అడ్డుకట్టలు నిర్మించారు. దీంతో గత పదేళ్లుగా బీటీ ప్రాజెక్ట్‌కు నీరు చేరడం లేదు. ఆయకట్టు బీళ్లుగా మారింది.
 
2017లో కురిసిన వర్షాలకు కర్ణాటక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు తెగిపోవడంతో బీటీ ప్రాజెక్ట్‌ 52 అడుగుల మేర నీరు చేరింది. దీంతో 10వ డిస్ట్రిబ్యూటర్‌ నుంచి 14వ డిస్ట్రిబ్యూటర్‌ వరకు సుమారు 3,252 ఎకరాల్లో పంటలు పండించి రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి ఖరీఫ్‌లో వర్షాలు కురిసి ప్రాజెక్ట్‌కు నీరు చేరుతాయనే ఆశతో రైతులు  ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశలు గల్లంతయ్యేలా కర్ణాటక ప్రభుత్వం రెండు భారీ చెక్‌డ్యామ్‌లు వేదవతి హగరిపై నిర్మిస్తోంది.
 
వేదవతి హగరికి భారీ ఎత్తున నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలైన చోళూరు గ్రామ సమీపాన, పరుశరాంపురం మండలంలోని జుంజరకుంట గ్రామం వద్ద భారీ చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వేగవంతంగా చేపడుతున్నారు. వచ్చే రెండు నెలల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టి పక్కనే ఉన్న గ్రామాల చెరువులకు నీటిని తరలించే పనులు చకచకా సాగుతున్నాయి. రూ.35 కోట్లతో చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నారు.
 
ఫలితంగా బీటీపీకి నీరురాక సుమారు 2 వేల మంది రైతు కుటుంబాలు రోడ్డునపడ్డాయి. పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు దాపురించాయి. ప్రస్తుత ప్రభుత్వం, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు అడ్డుకట్టలపై స్పందించకపోతే జిల్లా రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బీటీపీకి కృష్ణా జలాలను తరలించే పనులను వేగవంతం చేసింది. ఇక కృష్ణా జలాలు వచ్చే వరకూ కర్ణాటక ప్రభుత్వం అక్రమ కట్టడాల వల్ల ప్రాజెక్ట్‌కు కర్ణాటక నుంచి నీరు చేరే పరిస్థితి కనబడటం లేదు. గత సంవత్సరంలా కర్ణాటక నుంచి ప్రాజెక్ట్‌కు నీరు వస్తాయన్న రైతుల ఆశలు గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది.

Related Posts