ఏపీ సర్కార్ సాధ్యంకాని విధానాలను తెరపైకి తీసుకువస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యమైన విధానాలను కూడా ప్రవేశపెడుతోంది.అదే తాగునీటి ప్రాజెక్టుల తనఖా విధానం. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా 13 జిల్లాల్లోనూ తాగునీటి సమస్యలు ఎక్కడికక్కడ వెలుగు చూస్తూనే వున్నాయి. ఎన్నికల వాతావరణం కమ్ముకుంటున్న తరుణంలో హడావిడిగా తాగునీటి సమస్యకు పరిష్కారాన్ని చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అమలుచేయడానికి సరిపడా నిధులు ప్రభుత్వం వద్ద లేవు. ఉన్న నిధులతో సరిపడే ప్రాజెక్టులను చేపట్టడం ఒక విధానమైతే, అవకాశమున్న చోట రుణం తీసుకువచ్చి అత్యవసరమైన ప్రాంతాల్లో మంచినీటి ప్రాజెక్టులను నిర్మించడం మరో విధానం. వీటికి భిన్నంగా సరికొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పెద్ద ఎత్తున తాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలని తలపెట్టారు. దీనికోసం దాదాపుగా రూ.6330 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. అయితే ఆ స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఖర్చుచేసే పరిస్థితులు అంతంతమాత్రం కావడంతో ఈ సమస్య గట్టెక్కడానికి తీసుకువచ్చిన కొత్త విధానం తాగునీటి ప్రాజెక్టులను తనఖా పెట్టడమే. ఆ విధంగా వచ్చిన నిధులతో ఈ ప్రాజెక్టులను నిర్మించి ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా రూ.5330 కోట్లు రుణంగా పొందేందుకు అనుమతులు కూడా మంజూరుచేసింది. ఈ మేరకు రాష్ట్ర తాగునీటి కార్పొరేషన్‌కు ఆదేశాలు జారీచేసింది. కార్పొరేషన్ ఎండీకి రుణాల సమీకరణ, ఇతర అంశాల విషయంలో అధికారం కూడా దఖలుపరుస్తూ జీవో జారీచేసింది. జాతీయ బ్యాంకుల నుంచే ఈ రుణాలను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ రుణాలపై వార్షిక వడ్డీ 7.9 శాతం మించకుండా కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రధాన రుణ మొత్తానికి ప్రభుత్వం గ్యారంటర్‌గా కొనసాగుతుంది. దీనిపై క్వార్టర్లీ వడ్డీలు, ఇతర అంశాల చెల్లింపులు జరుగుతాయని కూడా పేర్కొంది. ఈ రకంగా చూస్తే తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం వాటిని తాకట్టు పెడుతూ తీసుకుంటున్న నిధుల తిరిగి చెల్లించే ప్రక్రియ ఇక దాదాపుగా రానున్న ప్రభుత్వానిదే అనడంలో సందేహం లేదనే చెప్పాలి. ఈ విధంగా మొదటి దశలో వివిధ బ్యాంకుల నుంచి రూ.2500 కోట్ల రుణాలను సమీకరించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే డాక్యుమెంట్ల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. జనవరి 31 నాటికి ఈ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే ప్రధానమైన రుణమొత్తాన్ని 48 సమానమైన క్వార్టర్లీ వాయిదాల రూపంలో చెల్లిస్తారు. ఈ విధంగా వచ్చే 15 ఏళ్ల పాటు ఈ చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతుందని తెలుస్తోంది. ముందుగా రూ.2500 కోట్లతో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ పథకాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఏదేమైనా నిధులు అందుబాటులో లేని సమయాల్లో ప్రభుత్వాలు అటు కేంద్రం నుంచో ఇటు వేర్వేరు ఏజెన్సీల నుంచో రుణాలు తెచ్చి ఆ మేరకు ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం అందరికీ తెలిసిందే. అయితే ఆ విధానానికి స్వస్తి చెప్పి సరికొత్తగా తనఖా పెట్టి ఆ డబ్బుతో ప్రాజెక్టులు నిర్మించే విధానానికి ఇప్పుడు నాంది ప్రస్తావన పడిందనే చెప్పాలి. రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా విస్తరించి ఎన్ని ఆస్తులు తాకట్టులోకి వెళ్లిపోతాయో వేచిచూడాల్సిందే. ఏదేమైనా ఈ ప్రక్రియ కూడా ఎన్నికలకు సన్నద్ధం కావటంలోనే భాగంగా రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.
ఇక పనుల విషయానికొస్తే పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం రూ.762.53కోట్ల విలువైన మంచినీటి పథకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మొత్తానికి విజయబ్యాంకు వద్ద తనఖా పెట్టి నిధులు తీసుకోవాలని నిర్ణయించారు.