నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో రోజ్ గార్డెన్‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి పరిధిలోని శాఖమూరు వద్ద 300 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పార్క్‌లో భాగంగా దీనిని అభివృద్ధి చేయనున్నారు. రోజ్ గార్డెన్‌ను 22 ఎకరాల్లో దాదాపు 30 కోట్ల రూపాయలతో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టనుంది. ప్రపంచ వ్యాప్తంగా రోజ్ గార్డెన్‌లకు ఉన్న ప్రజాకర్షణను దృష్టిలో ఉంచుకుని రాజధానిలో కూడా నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. రోజ్ గార్డెన్‌లో వివిధ రకాల గులాబీ మొక్కలను ఏర్పాటు చేయడమే కాకుండా మరింత ఆకర్షణగా తీర్చిదిద్దనున్నారు. రోజ్ గార్డెన్‌లో భాగంగా బ్రిడ్జ్ రోజ్ గార్డెన్, గ్లాస్ హౌస్ గార్డెన్, ఫెయిరీ కాసిల్ గార్డెన్, స్క్లప్చర్ గార్డెన్, వాటర్‌ఫాల్ రోజ్ గార్డెన్, టోపియరీ గార్డెన్, క్లాసిక్ యూరోపియన్ ఫౌంటేన్ గార్డెన్, నటరాజ్ గార్డెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పార్క్‌లో కృత్రిమంగా చిన్న నది వంటి దానిని అభివృద్ధి చేసి అక్కడ బ్రిడ్జ్ గార్డెన్‌ను అభివృద్ధి చేయనున్నారు. జపనీయుల పగోడాలను తలపించేలా గులాబీ మొక్కలు, తీగజాతి మొక్కలతో తీర్చిదిద్దుతారు. జానపద కథల్లో ఉండే భవనాల తరహాలో కొన్ని నిర్మాణాలను ఫెయిరీ కాసిల్ గార్డెన్‌లో అభివృద్ధి చేయనున్నారు.