తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే అష్టబంధన, బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగస్టు 12 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా 4 రోజుల పాటు ఆర్జితసేవలు రద్దుచేస్తున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణను ఋత్వికులు, వేద పండితులు, ప్రబంధ పండితులు, వేదవిద్యార్థులు పాల్గొని శాస్త్రోక్తంగా నిర్వహించాలన్నారు. 15న మహాశాంతి, తిరుమంజనం నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 16 ఉదయం 10.16 గంటలకు తులా లగ్నంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మహాసంప్రోక్షణ జరిగే 5రోజుల పాటు పరిమితంగా భక్తులకు దర్శనం చేయించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు తిరుమలయాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఉంటుందని విజ్ఞప్తిచేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఈనెల 26న అన్ని విభాగ అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 30 నాటికి ఇంజనీరింగ్ పనులను పూర్తిచేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు ఆయన తెలిపారు. హర్యానా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 1 నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రోజుకు 2000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారన్నారు. కన్యాకుమారి, హైదరాబాద్ నగరాల్లో టీటీడీ నిర్మిస్తున్న శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.
అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు అందిన అనంతరం మాస్టర్ ప్లాన్ రూపొందించి పనులు చేపడుతామన్నారు.