- సైకిల్ సవారీని ప్రారంభించిన సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సచివాయ ప్రాంగణంలో సైకిల్ తొక్కారు. బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో స్మార్ట్ సైకిళ్లను చంద్రబాబు ప్రారంభించారు. స్మార్ట్ సైకిళ్ల కోసం 3షెల్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉద్యోగులు, సందర్శకుల కోసం 24 స్మార్ట్ సైకిళ్లను అందుబాటులో ఉంచారు. ఒక్కో స్మార్ట్‌సైకిల్ ధర రూ. లక్ష చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాలుష్యరహిత అమరావతిలో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్‌గా స్మార్ట్‌సైకిళ్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వాధికారులు మీడియాతో చెప్పారు. సైకిల్ తయారీ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సైకిల్ పార్కింగ్ ప్రదేశంలో ఏసీలు, సోలార్ ప్యానల్, కుర్చీలు ఏర్పాటు చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. దగ్గర్లో ఉద్యానవనం ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. తన కార్యాలయం వరకూ సీఎం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి సచివాలయ ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపారు. అనంతరం సీఎం సచివాలయ అధికారులతో సమావేశమయ్యారు.
సైకిల్ కావలసినవారు...
జర్మనీ నుంచి ఇప్పటికే 30 అత్యాధునిక సైకిళ్లు దిగుమతి చేసుకున్నారు. సచివాలయం పరిధిలో మొత్తం మూడు స్మార్ట్ సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేసి, ప్రతి స్టేషన్‌లో 10 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. సచివాలయం ఆవరణలో 2 స్మార్ట్ సైకిల్ స్టేషన్లు ఉండగా, సచివాలయం వాహనాల పార్కింగ్ వద్ద మరో స్టేషన్ను ఏర్పాటు చేయడమైంది. వీటిలో ఎక్కడైనా సైకిల్ తీసుకోవచ్చు, ఎక్కడైనా అప్పగించవచ్చు. ఉచితంగానే వినియోగించుకోవచ్చు. సైకిల్ కావలసినవారు పేరు నమోదు చేసుకుంటే ప్రత్యేకమైన 'యాక్సెస్ కార్డు' ఇస్తారు. యాక్సెస్ కార్డుని సైకిల్‌కుండే కంప్యూటర్‌కి చూపిస్తే తాళం తెరుచుకుంటుందని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.