- క్రీడా స్ఫూర్తి కోసం ఈ స్పోర్ట్స్ ఈవెంట్..
కేంద్ర ప్రభుత్వ ముద్దుబిడ్డ ‘ఖేలో ఇండియా’ స్పోర్ట్స్ ఈవెంట్ బుధవారమిక్కడ ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు పోటీల్లో తమిళనాడు జట్టు ఆధిక్యంలో నిలిచింది. 2 స్వర్ణ, 2 రజత, 1 కాంస్య పతకాలతో మొత్తం 5 పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడుకు చెందిన సి. ప్రవీణ్ అండర్-17 బాలుర ట్రిపుల్ జంప్‌లో స్వర్ణం గెలిచాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ గుజ్జార్, ఆకాశ్ ఎం. వర్ఘీస్ రజత, కాంస్య పతకాలను సాధించారు. బాలికల 1500 మీటర్ల ఈవెంట్‌లో కేరళకు చెందిన సి. చంతిని పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా.. మహారాష్ట్రకు చెందిన ప్రగతి ములాని, పల్లవి జగ్ధాలె రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో అండర్-17 కేటగిరిలో 16 క్రీడాంశాల్లో అథ్లెట్లు పతకాల కోసం పోటీ పడనున్నారు. మొత్తం 199 స్వర్ణ, 199 రజత, 275 కాంస్య పతకాలు అందుబాటులో ఉన్నాయి. అట్టడుగు స్థాయి నుంచి దేశంలో క్రీడా సంప్రదాయాన్ని నెలకొల్పాన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఖేలో ఇండియా కార్యక్రమానికి తెరలేపింది.