- పనితీరుపై ప్రధాని మోడీ పూర్తి సంతృప్తి
- వచ్చే ఎన్నికల తర్వాత ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్..?
తెలుగుదేశం సీనియర్ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు త్వరలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా?. అంటే అవునంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. గత కొంత కాలంగా ఆయన పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. తాజాగా కేంద్ర పౌరవిమానయాన శాఖకు చెందిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి వచ్చిన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్టును చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా రద్దు చేసిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ప్రధాని మోడీకి ఈ విషయంలో ఎలా సమాధానం చెప్పాలన్నది ఆయనకు పెద్ద సమస్యగా మారిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే అశోక్ గజజతిరాజు పనితీరుపై ప్రధాని మోడీ పూర్తి సంతృప్తిగా ఉన్నారని…కొద్ది కాలం క్రితం స్వయంగా మోడీనే కొంత మంది టీడీపీ ఎంపీల పేర్లు ప్రస్తావించి వీళ్ల మధ్య మీరు ఎక్కడ ఉంటారు?. వచ్చే ఎన్నికల తర్వాత ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపిస్తానని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అశోక్ గజపతిరాజు ప్రస్తుతం విజయనగరం ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీటు నుంచి తన కుటుంబ సభ్యులను బరిలో దింపాలనే ఆలోచనలో అశోక్ గజపతిరాజు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఎంపీ సీటు లేదంటే..ఎమ్మెల్యే సీటు అశోక్ గజపతిరాజు తన కుమార్తెకు ఇప్పించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి అశోక్ గజపతిరాజు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు వెళతారని చెబుతున్నారు. అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఉండటం వల్ల పార్టీకి కూడా కలిసొస్తుంది కాబట్టి చంద్రబాబు ఆ ఫ్యామిలీని దూరం చేసుకోకపోవచ్చని చెబుతున్నారు.