ఈసారైనా వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుందా? అసెంబ్లీకి హాజరై ప్రజాసమస్యలతో పాటు రాష్ట్ర విభజన హామీల అంశాలను కూడా సభా వేదికగా ప్రస్తావించాలని మేధావులు కోరుతున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు సయితం వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరవ్వాలని పదే పదే కోరుతున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఈవిషయంలో పట్టుబట్టి ఉన్నారు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేసేంత వరకూ అసెంబ్లీకి వెళ్లబోమని జగన్ ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈనెలలో జరుగనున్నాయి. ఇంకా తేదీలు ఖరారు కాకపోయినప్పటికీ ఈనెల 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని అనధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గత కొన్ని సమావేశాల నుంచి వైసీపీ సభ్యులు అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. జగన్ పాదయాత్ర ప్రారంభించిన నవంబరు నెలలోనే అసెంబ్లీ సమావేశాలను పెట్టడం, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం వంటి వాటిపై గుర్రుగా ఉన్న వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది.ఈ సమావేశాలకు కూడా వైసీపీ హాజరయ్యేది అనుమానమే. అయితే మేధావులు, ఉన్నత విద్యావంతులు మాత్రం వైసీపీ అసెంబ్లీకి హజరవ్వాలని కోరుతున్నారు. ఐదేళ్లు ప్రజలు ప్రతిపక్షానికి అధికారమిస్తే ప్రభుత్వంపై సభలో నిలదీసే అవకాశాన్ని వైసీపీ చేజేతులా కోల్పోతుందంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీతో పాటు కొన్ని విపక్షాలు సయితం వైసీపీ అసెంబ్లీ బహిష్కరణను తప్పుపడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వైసీపీ ప్రతిపక్షపాత్ర పై పదే పదే విమర్శలు చేస్తున్నారు. కాని జగన్ మాత్రం అక్కడకు వెళ్లినా మైకులు ఇవ్వరని, తమ అభిప్రాయాలకు సమయం కేటాయించని సభకు వెళ్లినా ఒక్కటే…వెళ్లకపోయినా ఒక్కటే అన్న భావనను పార్టీ నేతల వద్ద వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఈ సమావేశాలను తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మలచుకోనుంది. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై బీజేపీని, మోడీని నిలదీసేందుకు ఈ సమావేశాలను ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. అందుకే దాదాపు 18 రోజులు సమావేశాలను నిర్వహించి మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకుంది. ఈ నెల 12న జరిగే టీడీపీ విస్తృత స్థాయి సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల తేదీలను నిర్ణయించే అవకాశముంది.