జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలూ రానున్నాయి. ఇంత హడావుడి ఉన్నా.. ఇంకా వైసీపీ.. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జనలు పడుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీకి ధీటుగా బలమైన నేతలను రంగంలోకి దింపాలని చూస్తోంది.
అయితే, గత ఎన్నికలను గుణపాఠంగా నేర్చుకున్న కొందరు కీలక వైసీపీ నేతలు పోటీకి ససేమిరా..! అనడంతో అధినేత సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది.
విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలతోపాటు నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉంటాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున కేశినేని నాని, వైసీపీ తరఫున కోనేరు రాజేంద్ర ప్రసాద్, కాంగ్రెస్ తరుఫున దేవినేని అవినాశ్ పోటీపడ్డారు. త్రిముఖ పోరులో నాని సుమారు 75వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనపై పోటీ చేసిన కోనేరు ప్రసాద్ ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేయడంతోపాటు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అవినాశ్ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. విజయవాడ ఎంపీగా గెలుపొందిన నాని టీడీపీ తరఫున మరోసారి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
తన ముక్కు సూటితనం కారణంగా కొన్ని అంశాల్లో వివాదాస్పదమైనా అభివృద్ధి కార్యక్రమాల పరంగా.. ప్రజలకు అందుబాటులో ఉండటంలోనూ నాని ముందంజలో ఉన్నారు. బెంజి సర్కిల్ ఫ్లైవోర్, దుర్గగుడి ఫ్లైవోర్, బెజవాడ రహదారుల విస్తరణ, గ్రీనరీ అభివృద్ధి, విజయవాడ విమానాశయ్రం ఆధునికీకరణ, వీటన్నింటికీ మించి విజయవాడ పార్లమెంటు పరిధిలో టాటా ట్రస్ట్ సేవలను నాని పూర్తిస్థాయిలో వినియో గించుకుంటున్నారు. తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలందరితో సఖ్యతగా ఉండటం, పార్టీ నేతలను సమన్వయం చేసుకుని కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఢీకొనాలంటే బలమైన అభ్యర్థి తప్పనిసరి అని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
వైసీపీ తరఫున విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి కోసం ఆ పార్టీ అగ్రనేతలు పలువురిని సంప్రదిస్తున్నారు. వీరు సంప్రదిస్తున్న వారిలో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక దశలో ప్రస్తుతం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి విజయవాడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన విశాఖ ఎంపీ స్థానంపై దృష్టి పెట్టారు. విజయవాడ నుంచి పార్టీ ఎంపీగా పోటీ చేయించేందుకు నగరంలో హోటళ్ల వ్యాపారంలో స్థిరపడిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దకు ఆ పార్టీ నేతలు రాయబారం పంపారు. వారి ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను వ్యాపారంలో ఉన్నానని తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. మరో ముగ్గురు పారిశ్రామికవేత్తలనూ వైసీపీ నేతలు సంప్రదించినా వారు కూడా ప్రాథమిక దశలోనే ఆ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు సమాచారం.
గత ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఒక దశలో విజయవాడ నుంచి పోటీ చేయాలని ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. బీజేపీ నుంచి పోటీ చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్లు కూడా దక్కవని కొంత మంది సన్నిహితులు ఆమెకు చెప్పినట్లు సమాచారం. అయితే పురంధేశ్వరి వైసీపీలో చేరి పోటీ చేస్తే ఎలా ఉంటుందని మరికొందరు ఇటీవల విజయవాడలో ఆరా తీయడం గమనార్హం. అయితే ఈ విషయాన్ని ఇటీవల నగరానికి వచ్చిన పురంధేశ్వరి ఖండించారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి పార్థసారథిని విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలన్న ఆలోచన ఉన్నా, ఆయన మళ్లీ ఎంపీ బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఆయన పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చివరి ప్రయత్నంగా గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని ప్రయత్నించిన పొట్లూరి వరప్రసాద్ పేరును ఆ పార్టీ నేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రయత్నం ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాలి. మచిలీపట్నం పార్లమెంటు స్థానంలోనూ వైసీపీకి అదే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కె.పార్థసారథి పోటీ చేసి కొనకళ్ల నారాయణ చేతిలో 81వేల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఆయన ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బాడిగ రామకృష్ణను ఆ పార్టీ నేతలు సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే పోటీకి ఆయన సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం భారీ ఖర్చే. ఈ స్థానం నుంచి పోటీ చేసే వ్యక్తి కనీసం రూ.50 నుంచి 70 కోట్లు వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచేందుకు అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. విజయవాడలో పోలిస్తే మచిలీపట్నంలో భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకున్నా అక్కడ కూడా ఆ పార్టీ అభ్యర్థుల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఉండటం గమనార్హం.