వచ్చే ఎన్నికల్లో జనసేన కాదు..ఏ సేనా తమపై ప్రభావం చూపించలేవని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ వల్ల వైసీపీకి ఏ రకంగానూ నష్టం జరగదని తెలిపారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఊరూరు తిరిగి టీడీపీకే ఓటు వేయమని చెప్పాడు కదా? అని ప్రశ్నించాడు. తమ గెలుపు అవకాశాలను ఏ సేనా దెబ్బతీయలేదన్నారు. గత ఎన్నికల్లో బిజెపి, టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తేనే తమకు..టీడీపికి ఓట్ల తేడా ఐదు లక్షలు మాత్రమే అన్నారు. పవన్ గత ఎన్నికల్లో టీడీపీకే ఓట్లు వేయమన్నారని..ఆయన అభిమానులు అందరూ టీడీపీకే ఓటు వేశారన్నారు. దీంతోపాటు మోడీ హవా కూడా అప్పట్లో టీడీపీకి కలిసొచ్చిందని తెలిపారు. ఈ లెక్కన చూస్తే కొత్తగా తమపై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం లేదన్నారు. పాదయాత్రలో ఉన్న జగన్ ఓ ఛానల్ తో మాట్లాడుడూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓట్లు వేయించేవాడు దేవుడు..వేసేవాళ్ళు ప్రజలు అన్నారు. తమకు ఎవరి వల్ల మేలు జరుగుతుందని భావిస్తే వాళ్లకే ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. పవన్ వల్ల వైసీపీకి ఏ రకంగానూ నష్టం జరగదని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నట్లు ఏపీకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమీ రావటంలేదని..లక్షలాది ఉద్యోగాలు ఏమీలేవన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని చెబుతున్నాయని వెల్లడించారు. తాము ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేస్తామని..తమ ప్లీనరీలో చెప్పిన వాటినే పాదయాత్రలో ప్రస్తావిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా పథకాల్లో ప్రజల నుంచి సూచనల ప్రకారం కాస్త అటూ ఇటూ మార్పులు చేస్తున్నాం తప్ప…కొత్తగా ఏమీ చెప్పటంలేదన్నారు. ఎన్నికల సమయంలో పొత్తులకు ఇంకా చాలా సమయం ఉందని..దీనిపై ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.