YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మౌలిక సదుపాయాల్లో సింగపూర్ ఆదర్శం - సీఎం చంద్రబాబు..

మౌలిక సదుపాయాల్లో సింగపూర్ ఆదర్శం -  సీఎం చంద్రబాబు..
మౌలిక సదుపాయాల కల్పనలో  ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన సింగపూర్ నవ్యాంధ్రప్రదేశ్కు ఎంతో స్ఫూర్తినిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్కు బలమైన ఆర్ధిక వ్యవస్థ ఉందని,  ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య మానవ వనరులున్నాయని, ఉభయులం కలసి పనిచేస్తే ప్రపంచానికి అత్యుత్తమ ఉత్పత్తులు అందించవచ్చని ఆయన సూచించారు. 
 ఆంధ్రప్రదేశ్ ప్రజలలో వాణిజ్య నాయకత్వ లక్షణాలు పెంపొందించాలన్నది తమ ధ్యేయమని, ఇలా తీర్చిదిద్దేందుకు తాము సింగపూర్ సహకారం కోరుతున్నామని, నైపుణ్యాభివృద్ధిలో సింగపూర్ చొరవను, చోదకతను వారికి  అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా, రాజధాని అమరావతి తదితర ఆకర్షణీయ నగరాలకు పెట్టుబడులు, సాంకేతిక సహకారాలు లక్ష్యంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన మంగళవారం మూడవ రోజుకు చేరింది.  సింగపూర్ ట్రెజరీ భవనంలో సింగపూర్ ఆర్ధిక మంత్రి హుంగ్ స్వీ కేట్తో భేటీ అయిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యాలను, ప్రత్యేకతలను వివరించారు.  
సింగపూర్ సంస్థల నుంచి తక్కువ వడ్డీతో ఆర్థిక సహాయం అందేలా వారికి మార్గదర్శనం చేయాలని చంద్రబాబు సింగపూర్ ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.  ‘ఆర్థిక సహాయం అందించడంలోనే కాదు. ఆంధ్రప్రదేశ్ వ్యాపారాల్లో మీరు భాగస్వామిగా వుండాలని కోరుకుంటున్నాం’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.   సింగపూర్లో ప్రతి రంగంలో ప్రస్ఫుటించే  సూక్ష్మ మెళకువలు తమనెంతో ఆకట్టుకున్నాయని, సింగపూర్ నైపుణ్యాలు, సాంకేతికతను వినియోగించుకుని రాజధాని అమరావతిలో అత్యుత్తమ పౌర సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.. పౌరసేవల్లో నాణ్యతను మెరుగుపరచుకొని, పౌరులకు జవాబుదారీగా ఉండాలన్న లక్ష్యంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం తాము ఇప్పటికే సాంకేతికతను గరిష్ఠ స్థాయిలో ఉపయోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని రకాల పౌర సేవలను సమీకృతం చేసి ఆన్లైన్ ద్వారా ఒకే వేదిక నుంచి  అందిస్తున్నామని తెలిపారు.  
  ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నామని, రాష్ట్ర ప్రజలందరికీ ఫైబర్ గ్రిడ్ భద్రత కల్పించినట్లు వివరించారు. సెన్సర్ల ఆధారిత వీధి దీపాల వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టామని చెప్పారు. తుపానుల రాకడను ముందుగానే పసిగట్టి రైతాంగాన్ని అప్రమత్తం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో వాతావరణ, వర్ష సూచనలు తీసుకుని, ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని, వారికి దిక్సూచిగా నిలిచామని చంద్రబాబు తెలిపారు. 
వాణిజ్యం, పెట్టుబడుల ఆకర్షణలో ఆదర్శంగా ఉన్నామని, తమ కృషి ఫలితంగా $2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కొరియాకు చెందిన కియా మోటార్స్ను తీసుకొచ్చామని చెప్పారు. వచ్చే ఏడాదికి కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ లో వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించనుందని ఏపీ ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తాము కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాల వల్ల ఒక్క కియా మాత్రమే కాకుండా ఇసుజు, హీరో మోటార్స్ లాంటి దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులతో వచ్చాయని చంద్రబాబు వివరించారు.
కష్టపడటంలో ఇద్దరూ ఇద్దరే 
సింగపూర్ ఆర్థిక మంత్రి హుంగ్ స్వీ కేట్  మాట్లాడుతూ లీ కౌన్ యూ, ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. వారిద్దరి మధ్య సాపత్యాన్ని వివరిస్తూ ‘మా నాయకుడు లీ కౌన్ యూ, చంద్రబాబు నాయుడు మధ్య ఒక సామీప్యత ఉంది. ఆ ప్రత్యేకతను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. వీరిద్దరూ  భారీ లక్ష్యాలను ముందు పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని సాధించటానికి ఎంతో శ్రమిస్తారు. మొక్కవోని వీరి దీక్షా, దక్షతలే  ఉభయ ప్రాంతాలను పతనం అంచుకు చేరకుండా సురక్షితంగా నిలిపి వుంచాయి’ అని ప్రశంసించారు.  

Related Posts