YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

వన జాత..మేడారం జాతర.

వన జాత..మేడారం జాతర.

ఉత్తర తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన తాడ్వాయి ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఇక్కడి అడవులు, కొండలు, కోనల మధ్య గిరిజన సంస్కృతికి ప్రతీకగా ఈ జాతర జరుగుతుంది.

ఈ జాతర వెనక ఒక చారిత్రక కథ ఉంది. పూర్వం జగిత్యాల ప్రాంతంలోని పొలాస (పొలవాస)ను మేడరాజు అనే గిరిజన దొర పాలించేవాడు. ఆయన కూతురు సమ్మక్క. ఆమెకు తన మేనల్లుడైన మేడారం పాలకుడికి ఇచ్చి వివాహం చేశాడు మేడరాజు. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలాసపై దండెత్తి వెళ్లాడు. ఆ శౌర్యానికి తట్టుకోలేక మేడరాజు పొలాస నుంచి వెళ్లిపోయి, మేడారంలో అజ్ఞాతవాసం చేశాడు.

మేడారం పాలకుడు కాకతీయులకు సామంతుడు. కరవు కాటకాలు ఏర్పడటంతో, ఆ రాజులకు పన్నులు కట్టలేకపోయాడు. మేడరాజుకు ఆశ్రయం- అగ్నికి ఆజ్యంలా మారింది. మేడారం పాలకుడు గిరిజనుల్ని రెచ్చగొడుతున్నాడని, తన సార్వభౌమత్వాన్ని చిన్నచూపు చూస్తున్నాడని ప్రతాపరుద్రుడు మండిపడ్డాడు. మాఘ శుద్ధ పౌర్ణమినాడు మేడారం మీద దండెత్తాడు. 
సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న వీరోచితంగా పోరాడారు. కాకతీయుల సైన్యం ధాటికి తట్టుకోలేక మేడరాజు, సారలమ్మ, నాగులమ్మ యుద్ధంలో మరణించారు. అవమానాన్ని తట్టుకోలేక జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు

సమ్మక్క వీరోచితంగా పోరాడి, కాకతీయ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది. ప్రతాపరుద్రుడు సైతం ఆమె వీరత్వాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. గాయపడిన సమ్మక్క రక్తధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమిస్తుంది. చిలుకల గుట్ట వైపు వెళుతూ, అందరూ చూస్తుండగానే మాయమవుతుంది. వెదుకుతూ వెళ్లిన అనుచరులకు ఆమెజాడ కనిపించదు. మాయమైన చోట పసుపు, కుంకుమల భరిణె కనిపిస్తుంది. పవిత్ర భరిణెను సమ్మక్కగా భావించి, ప్రతి రెండేళ్లకూ ఒకసారి మాఘ శుద్ధ పూర్ణిమనాడు సమ్మక్క జాతర జరపడం ఓ సంప్రదాయంగా మారింది.

సంస్కృతి, సంప్రదాయం, నాగరికత- మనిషిని ఉన్నత స్థానంలో నిలుపుతాయి. అతడిలో సుగుణాలు రత్నాల్లా వెలుగొందడానికి ఇటువంటి జాతరలు దోహదం చేస్తాయి. జీవితం అంటే కేవలం తిండి, నిద్ర, సౌఖ్యం కాదని; మానసికోన్నతి సాధించడమేనని అందరూ తెలుసుకున్నప్పుడు- సమ్మక్క సారలమ్మ జాతరలోని పరమార్థం అవగతమవుతుంది

Related Posts