బీజేపీకి పవన్ దత్తపుత్రుడని విమర్శించారు ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు. ఉత్తరాంధ్ర పర్యటనలో జనసేనాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పవన్‌కు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలన్నారు మంత్రి లోకేష్. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ప్రత్యేక ఉత్తరాంధ్ర పేరుతో ఆయన చిచ్చు పెడుతున్నారని.. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ అంటోందన్నారు. పవన్ మోదీకి దత్తపుత్రుడిలా మారారని విమర్శించారు లోకేష్. పవన్‌కు 25 ప్రశ్నలతో లేఖాస్త్రం సంధించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ‘ప్రత్యేక హోదా కోసం దేశమంతా తిరిగైనా మద్దతు కూడగడతానని చెప్పారు.. కేంద్రం నిధుల విషయంలో కమిటీ పేరుతో హడావిడి చేశారు.. ఆ రెండు అంశాలపై జనసేనాని ఎందుకు మాట్లాడటం లేదు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న పవన్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం సరికాదు. కేంద్రాన్ని పవన్ ఎందుకు నిలదీయడం లేదు.. బీజేపీ, వైసీపీని ఒక్కమాట ఎందుకు అనడం లేదు. అంటే మోదీ, జగన్‌తో కుమ్మక్కై.. వాళ్లిచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారు’అని విమర్శించారు గంటా. పవన్, జగన్‌లపై మండిపడ్డారు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. పవన్, జగన్, కన్నాలతో కలిసి మోదీ అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. గతంలో పీఆర్పీ పెట్టి.. ఆ పార్టీని ముంచి కేంద్రమంత్రి పదవి తెచ్చుకున్న చరిత్ర ఉందన్నారు. చిరంజీవికి ఆ పదవి ఎలా వచ్చిందో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేష్‌పై ఆరోపణలు చేస్తున్న పవన్.. వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఆయన బాగా చదువుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆదేశిస్తే కన్నా లక్ష్మీనారాయణపై తాను.. జగన్‌పై తన కుమార్తె పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు జలీల్‌ఖాన్.