ఢిల్లీ ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ మితిమీరిన జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. కేజ్రివాల్ సర్కారు దూకుడు పెంచింది. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ‘ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన’ను ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా 77 వేల మంది సీనియర్ సిటిజన్లను ఢిల్లీ ప్రభుత్వం మూడు రోజులపాటు తీర్థయాత్రలకు తీసుకెళ్లనుంది. ఇందుకయ్యే పూర్తి ఖర్చును సర్కారే భరిస్తుంది. ఇందుకోసం ప్రాథమికంగా ఐదు రూట్లను ఎంపిక చేశారు. ఢిల్లీ-మదుర-బృందావనం-ఆగ్రా-ఫతేపూర్ సిక్రి-ఢిల్లీ, ఢిల్లీ-హరిద్వార్-రిషికేష్-నీలకంఠ్-ఢిల్లీ, ఢిల్లీ-అజ్మీర్-పుష్కర్-ఢిల్లీ, ఢిల్లీ-అమృత్‌సర్-వాఘా సరిహద్దు-ఆనంద్‌పూర్ సాహెబ్-ఢిల్లీ, ఢిల్లీ-వైష్ణోదేవి-జమ్మూ-ఢిల్లీ రూట్లలో తీసుకెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మరికొన్ని రూట్లను ఎంపిక చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా ఏటా ఢిల్లీలోని 70 అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఒక్కో నియోజకవర్గం నుంచి ఏటా 1100 మంది సీనియర్ సిటిజన్లను ఎంపిక చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ప్రకటించారు. రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ గత జనవరిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ పథకం పట్ల అభ్యంతరాలు లేవనెత్తారు. ఢిల్లీ టూరిజం శాఖకు చెందిన ఏసీ కోచ్‌ల్లో సీనియర్ సిటిజన్లను తీర్థయాత్రలకు తీసుకెళ్తారు. ప్రయాణం, వసతి, భోజనం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఒక్కో యాత్రికుడికి లక్ష రూపాయల బీమా సౌకర్యం కూడా కల్పిస్తారు. ఇది కేవలం పేద వృద్ధులకు మాత్రమే పరిమితం కాదు. ఆర్థికంగా ఇబ్బందులు లేని కుటుంబాలకు చెందిన వృద్ధులను కూడా వారి సంతానం సరిగా చూసుకోవడం లేదు. దీంతో అన్ని వర్గాల సీనియర్ సిటిజన్లను ఈ పథకంలో భాగం చేశామని ఢిల్లీ సర్కారు ప్రకటించింది.