” వంజి పంటకు కాకుండా,గోడికింకి… మనుష్యకింకి, ఎరు దోకోంది”
ప్రతికూల పరిస్ధితులను సైతం ఎదిరించి,పోరాడి, మార్పును తెచ్చిన మట్టిమనుషులున్న మహదేవపురంలో గడపడం, వారి సంతోషాలను పంచుకునే అవకాశం దొరకడం గొప్ప అనుభవం. ఎనిమిదేళ్ల క్రితం మహదేవపురంలో సాగునీరు,తాగునీరు లేక కరవు తాండవమాడేది. ఇదంతా లక్ష్మీదేవమ్మ చూస్తూ ఊరుకోలేదు. ఊరు బాగు కోసం స్వయంగా కొంగు బిగించింది. శ్రమదానంతో జలసంరక్షణ పనులు చేస్తే వలసలు ఆగుతాయని, తానే పలుగు, పార పట్టింది. ఆమె ఒక్కడుగు ముందుకు వేస్తే ఆమె వెనుక ఊరంతా కదిలింది….నలభై పంటకుంటలు,నాలుగు చెక్ డ్యామ్‌లను నిర్మించి రైతుల నీటి కష్టాలను తీర్చి, అన్ని రకాల పంటలు పండించుకునేలా చేసింది, మాయా మర్మమ్ తెలియని కోయ గిరిజన మహిళ లక్ష్మీదేవమ్మ.
సంఘటితంగా ఉంటే కరవునే కాదు,ఎంతటి కష్టానైనా జయించవచ్చని నిరూపించింది. నీటి ఎద్దడితో ఏడాదికి ఒక్క పంటనూ పండించుకోలేక పేదరికంతో అల్లాడిపోయే ఆ ఊర్లో ఒకపుడు 7బస్తాలు పండితే నేడు 25బస్తాలు పండుతోంది. ఒక్కొక్క గింజా రెండు చేతులెత్తి లక్ష్మీదేవమ్మకు జై కొడుతోంది.
ఆమె కోయ భాషలో…
” వంజి పంటకు కాకుండా,గోడికింకి… మనుష్యకింకి, ఎరు దోకోంది” అంటే…
” పంటలకే కాదు,మనుషులకు పశువులకు కూడా నీరు దొరుకుతోంది”.