తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారికి ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొందరికి, సాయంత్రం 6 గంటల నుంచి మరి కొందరికి షిప్టు పద్ధతిలో వ్యాపారాలు చేసుకోవడానికి కమిషనర్ విజయ్‌రామరాజు అనుమతించారు. నగరంలోని తోపుడు బండ్ల వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ వ్యాపారాలు చేసుకుంటే ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించడమే కాకుండా అపరిశుభ్రతకు కారణమవుతున్నారంటూ తోపుడు బండ్లను నిషేధించిన విషయం విధితమే. దీనికి వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా మున్సిపల్ కార్యాలయం వద్ద తోపుడు బండ్ల వ్యాపారులు నిరసన దీక్షలు చేస్తున్న విషయం విదితమే. సోమవారం కమిషనర్ తోపుడుబండ్ల వ్యాపారులతో చర్చలు జరిపారు. శ్రీనివాసం వద్ద ఉదయం 20 మంది, సాయంత్రం 20 మంది, విష్ణునివాసం వద్ద 6 మందికి, కోనేరు దక్షిణం వైపు ఉదయం, సాయంత్రం ఆరేసి మంది చొప్పున వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పారు. అలిపిరి వద్ద ఉదయం 6మంది, సాయంత్రం 6 మంది అదే స్థలంలో షిప్టు పద్ధతిలో వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. రుయా వద్ద ఉదయం 14 మంది, సాయంత్రం 14 మంది, స్విమ్స్ సర్కిల్ వద్దవున్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఉదయం నలుగురు, సాయంత్రం నలుగురు వ్యాపారం చేసుకోవచ్చన్నారు. వ్యాపారులు తప్పనిసరిగా తడి, పొడి చెత్తలకు వేర్వేరుగా డబ్బాలను ఉంచి చెత్తను మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. చేతులకు గ్లౌజులు, నోటికి మాస్కులు విధిగా ధరించాలని, రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లు ఆక్రమించి కుర్చీలు వేయవద్దని, ఆహార పదార్ధాలు కలుషితం కాకుండా, ఈగలు వాలకుండా చూసుకోవాలని, ప్లాస్టిక్ వాడకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించినా, వారికి కేటాయించిన స్థలంలో వ్యాపారాలు చేయకపోయినా, వినియోగదారులకు అసౌకర్యం కల్పించినా, ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసినా వారిపై కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.