కత్తి మహేష్, స్వామి పరిపూర్ణానందలను నగర బహిష్కరణ వివాదాలకు కారణమౌతోంది. రౌడీ షీటర్లపై మాత్రమే ప్రయోగించే సెక్షన్లను వీరిద్దరిపై ఎలా ప్రయోగిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే స్వామి పరిపూర్ణానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణనాట బహిష్కరణల ఇష్యూ.. హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫిల్మ్ క్రిటిక్.. కత్తి మహేష్, స్వామి పరిపూర్ణానందలను హైదరాబాద్ నుంచి బహిష్కరించడంతో.. సర్వత్రా ఇదే చర్చ. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందనే మహేష్ ను బహిష్కరించినట్లు చెప్పిన పోలీసులు.. పరిపూర్ణానంద విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకున్నారు. అయితే.. పోలీసుల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్ర్యపు హక్కు ఉంది. ఇతరులకు ఇబ్బంది కలిగించని రీతిలో.. సమాజంలో అశాంతి రేకెత్తించని విధంగా.. నచ్చిన మతాన్ని అవలంబించే హక్కు ప్రజలకు ఉంది. ఓ మతం విశ్వాసాలు, నమ్మకాలను కించపరిస్తే.. ఆ మతం పాటించేవారి మనోభావాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఇది సమాజంలో అశాంతికి దారితీయొచ్చు. ఇక కత్తి మహేష్ అనుచితి వ్యాఖ్యలు చేసింది దేశంలోని మెజార్టీ ప్రజల ఆరాధ్యదైవం కాబట్టి వారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలంగాణ పోలీసులు అంటున్నారు. వీరి ఆందోళనకు తగ్గట్లే స్వామి పరిపూర్ణానంద కత్తి కామెంట్స్ పై చర్య తీసుకోవాలంటే.... ధర్మగ్రహా యాత్రకు సిద్ధమయ్యారు. అయితే వివాదం ముదరకముందే.. చెక్ పెట్టాలని తలంచిన పోలీసులు కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు వేశారు. అటు పరిపూర్ణనందను హౌస్ అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు హైడ్రామా తర్వాత .... పరిపూర్ణనంద ను సిటీ నుంచి ఆర్పెల్ల పాటు బహిష్కరించారు. అయితే గతేడాది నవంబర్‌లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే బహిష్కరించామని పోలీసులు చెప్త్పుకొస్తున్నారు.లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందనే కత్తి మహేష్, స్వామి పరిపూర్ణానందలపై బహిష్కరణ వేటు వేసినట్లు పోలీసులు అంటున్నారు. అయితే.. న్యాయనిమావళి ప్రకారం.. ఈ చర్య సహేతుకం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లా అండ్ ఆర్డర్.. పబ్లిక్ ఆర్డర్ వేర్వేరు. సమాజ శాంతికి విఘాతం కలిగించే వ్యక్తులపైనే చర్యలకు ఆస్కారం ఉంటుంది. శాంతి భద్రతల విషయమై…నగర బహిష్కరణ తీవ్ర నిర్ణయం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ పోలీసుల నిర్ణయంపై స్వామి పరిపూర్ణానంద ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైదరాబాద్ పోలీసుల నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేశారు.