- టీవీ యాంకర్లు, జర్నలిస్టుల జీతాలు ఎంతనేది కూడా రహస్యమే.
- నార్వేలో మాత్రం ఇలాంటి రహస్యాలేమీ లేవు.
బీబీసీలోని టాప్ యాంకర్లకు ఎంతెంత జీతాలు ఉంటాయో ఈ మధ్యనే బ్రిటీష్ పేపర్లు బయటపెట్టాయి. అయితే, బ్రిటన్‌లోని మిగతా టీవీల్లోని యాంకర్ల జీతాలు ఎంతనేది ఇంకా దాపరికమే. మన దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టీవీ యాంకర్లు, జర్నలిస్టుల జీతాలు ఎంతనేది కూడా రహస్యమే.కానీ, నార్వేలో మాత్రం ఇలాంటి రహస్యాలేమీ లేవు. ఎవరెవరికి ఎంతెంత జీతం అందుతోందనేది ఎవరైనా తెలుసుకోవచ్చు. దీనివల్ల పెద్దగా సమస్యలేమీ రావటం లేదు.
నార్వేలో 1814వ సంవత్సరం నుంచే ఎవరెంత సంపాదిస్తున్నారు, ఆస్తులు ఏమేం ఉన్నాయి, ఎంత పన్ను కడుతున్నారనేది అందరూ తెలుసుకునే అవకాశం ఉంది. గతంలో ఈ సమాచారాన్ని ఒక పుస్తకంలో రాసి పబ్లిక్ లైబ్రరీలో పెట్టేవాళ్లు. 2001వ సంవత్సరం నుంచి ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెడుతున్నారు.
చాలా మందికి ఈ సమాచారం తెలుసుకోవటం సరదా అయ్యింది. అలా తెలుసుకున్న సమాచారాన్ని కొందరు ఫేస్‌బుక్‌లో పెట్టేస్తున్నారు.
నార్వే ప్రజలు ఆదాయపు పన్ను చాలా ఎక్కువగా చెల్లిస్తారు. వాళ్లు సగటున 40.2 శాతం పన్ను కడుతుంటే బ్రిటీష్ ప్రజలు కట్టేది 33.3 శాతం. అంత మొత్తం పన్ను కడుతున్నప్పుడు మిగతావాళ్లు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవాలనుకోవటం సహజమే.