YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో రెండుగా చీలిక

వైసీపీలో రెండుగా చీలిక
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల లొల్లి ఆ పార్టీని వేధిస్తోంది. హిందూపురంలో రెండు వర్గాలుగా విడిపోయి జయంతిని జరుపుకుంటే... కదిరిలో ఏకంగా వైఎస్ విగ్రహం సాక్షిగా నాయకులు, కార్యకర్తలు కొట్టుకున్నారు. గతంలో గడపగడపకూ వైసీపీ కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయ కర్త ఆధ్వర్యంలో చేపట్టాలని అధిష్ఠానం మార్గదర్శకాలు రూపొందించగా అప్పట్లో వైసీపీ నాయకులు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, చౌళూరు రామకృష్ణారెడ్డి ఒకవర్గంగా ఏర్పడి వేరుగా నిర్వహించేందుకు ఉపక్రమించారు. ఆయా పరిణామాలపై అప్పట్లో వైసీపీ అధిష్ఠానం కూడా దృష్టి పెట్టడంతో అసమ్మతి నాయకులు రెండు రోజులు మాత్రమే చేపట్టి ముగించారు. అప్పటి నుండి అసమ్మతి వర్గం పార్టీ కార్యక్రమాలకు దూరంగా హిందూపురంలో వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా నియోజకవర్గ సమన్వయ కర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో పరిగి బస్టాండ్‌లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కోసి పంచి పెట్టారు. అదేవిధంగా కొండూరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి పరిగి బస్టాండ్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించి వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు యూనిఫారంలను పంపిణీ చేశారు. కాగా ముందు నుంచి నవీన్‌నిశ్చల్‌ను విభేదిస్తున్న నియోజకవర్గ మాజీ సమన్వయ కర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి మరోమారు తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ పార్టీ కార్యక్రమాలను తన నేతృత్వంలో నిర్వహిస్తుండగా తాజాగా అసమ్మతి వర్గం మళ్లీ తెరపైకి రావడం ఆ పార్టీలో గ్రూపు తగాదాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. వర్గవిభేదాలపై ఇప్పటికే వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి ఆ పార్టీ నాయకులు తీసుకెళ్లారు. అయితే ముందు నుండి వ్యక్తిగతంగా తన పట్ల విభేదాలను చేస్తూ అసమ్మతి వర్గాన్ని పెంచుతున్నారని జగన్‌తో నవీన్‌నిశ్చల్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఏడాది కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి చేరిన న్యాయవాది ఇందాద్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు అందగా అధిష్ఠానం ఆయనకు నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇందాద్ కూడా అసమ్మతి వర్గం నాయకులతో కలిసి వైఎస్‌ఆర్ జయంతి కార్యక్రమాలకు హాజరయ్యారు. అసమ్మతి వర్గంలో కొండూరు వేణుగోపాల్‌రెడ్డితోపాటు ఆ పార్టీ నాయకులు బలరామిరెడ్డి, ఫైరోజ్‌అహ్మద్, రామచంద్రారెడ్డి, గోపికృష్ణ, కౌన్సిలర్ రహిమాన్, బసిరెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను కూడా నవీన్‌నిశ్చల్ ఆ పార్టీ రాష్ట్ర నేత మిథున్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా పార్టీ నాయకులను అందరిని కలుపుకోవాలని నవీన్‌నిశ్చల్‌కు సూచించినప్పటికీ తమను కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని అసమ్మతి వర్గం నాయకుల వాదన. 

Related Posts