రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. దీంతో జన జీవితం అస్తవ్యస్తమైంది. బుధవారం రాత్రి 12 గంటల సమయం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వర్షం పడుతూనే ఉంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు తోడు, గోదావరి పరీవాహక ప్రాంతంలో పడుతున్న వర్షాలకు నదిలో వరదనీరు మరింత ఎక్కువైంది. తెలంగాణలోని పలు ప్రాజెక్టుల గేట్లను అధికారులు తెరిచారు. కడెం ప్రాజెక్టుకు చెందిన మూడు గేట్లను ఎత్తారు. 700 అడుగుల నీటిమట్టం ఉండే ఈ రిజర్వాయర్ లో ఇప్పటికే 698 అడుగుల నీరు చేరింది. ఆసిఫాబాద్ జిల్లా కొమురం భీం ప్రాజెక్టుకు వరద పోటు ఎక్కువగా ఉండటంతో మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరింతగా పెరిగింది. భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగే కొద్దీ.. గోదావరి, శభరి నదుల పరివాహక ప్రాంతంలో ఉన్న కూనవరం, విఆర్పురం మండలాలకు వరద తాకిడి ఎక్కువగా ఉంటుంది. గోదావరి, శభరి నదుల వద్ద పది అడుగుల నీటి మట్టం పెరిగితే తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఖమ్మం. మహబూబాబాద్. భధ్రాద్రి కోత్తగూడెం.జనగామ. సూర్యపేట జిల్లా లో గత రెండు రోజుల గా కురుస్తున్న వర్షాలకు రోడ్ల ని జలమయమయ్యాయి. రాకపోకలు సహితం స్దంబించిపోయాయి. సత్తుపల్లిలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ఓపెన్‌కాస్ట్‌లో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జూబ్లి హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్సార్నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, ఖైరతాబాద్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అత్తిలి, ఉండ్రాజవరం, తణుకు, ఇరగవరం మండలాల్లో పంటలు నీటమునిగారు. భారీ వర్షాలతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లా ఎగువప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చింతూరు మండలంలోని సోకులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అవతలి ఒడ్డున ఉన్న గవన్లకోట, చదలవాడ, చౌలూరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి..