కేంద్రంపై ఏపీ సర్కార్ దుష్ప్రచారం చేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విశాఖలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ‘కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు రావడం బాబుకు ఇష్టం లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తూ.. టీడీపీ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తోంది. కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఏపీకి ఇచ్చిన హామీల్ని కేంద్రం కచ్చితంగా అమలు చేస్తుంది.. వాటి అమలుకు పదేళ్ల సమయం ఉందన్నారు’ లక్ష్మీనారాయణ. ఏపీకి రైల్వేజోన్ కూడా వస్తుంది. జోన్ ఇవ్వడం లేదని కేంద్రం ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదే. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులే కారణం. విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి కేంద్రం సాయం చేస్తూనే ఉంది. అవి తీసుకుంటూ మళ్లీ మాపైనే నిందలు వేస్తున్నారు. టీడీపీ కుట్రల్ని ఎదుర్కొంటాం.. ప్రజల్లోకి వెళతాం.. వాస్తవాలను వారికి వివరిస్తాం. ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఓట్లు అడిగే అర్హత బీజేపీకి మాత్రమే ఉంది. ఇటు కన్నాపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబును తిట్టడమే ఆయనకు పనిగా మారిందని.. నీడనిచ్చిన చెట్టునే నరికిన వ్యక్తి అంటూ విరుచుకుుపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి ఏదేదో చేస్తుందని గొప్పలు చెబుతున్న కన్నా.. కాపుల రిజర్వేషన్లపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.