దేశభక్తిలో ఆ యువకుడికి భగత్‌సింగే స్ఫూర్తి... అందుకే దేశం కోసం ఆయనలా ప్రాణాలను ఫణంగా పెట్టాలని భావించి సైనికుడిగా మారాలకున్నాడు. కానీ ఆర్మీలో ఉద్యోగం కోసం ఐదుసార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోవడంతో చివరకు విధిచేతిలో ఓడిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదవిదారకమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అంతేకాదు అతడు చనిపోయేముందు ఫేస్‌బుక్ లైవ్‌లో దీని గురించి వెల్లడించడం బాధాకరం. తెల్లవారుజామున 3 గంటలకు తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిని కొత్త ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి నగర్‌కు చెందిన మున్నా కుమార్ గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకోడానికి ముందు ఆ యువకుడు 1.09 నిమిషాలపాటు ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడాడు. అతడు లైవ్‌ను 2,750 మంది వీక్షించినా ఒక్కరు కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు. దీని గురించి తెలిసినా పోలీసులను గానీ, కుటుంబసభ్యులను గానీ అప్రమత్తం చేయలేదు. తాను ఆర్మీ ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణుడిని కాలేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర నిరాశపడ్డారని మున్నా తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. ఆరు పేజీల ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మున్నా కుటుంబసభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం ఆర్మీలో ఉద్యోగం కోసం ఐదుసార్లు పరీక్ష రాసినా విఫలమైనట్టు తెలిసింది. మున్నా తమ్ముడు వికాస్ కుమార్ మాట్లాడుతూ... భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకునే మున్నా, దేశం కోసం ఆర్మీలో చేరాలని భావించినట్టు తెలిపాడు. ఆత్మహత్యకు ముందుకు కూడా అతడు సాధారణంగా ఉన్నాడని, ఇద్దరం కలిసి రాత్రి భోజనం చేశాం.. ఇలా బలవన్మరణానికి పాల్పడతాడని కుటుంబంలోని ఎవరూ ఊహించలేదని వికాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. డ్రైవర్‌గా పనిచేసే మున్నా తండ్రి ప్రభు ప్రసాద్ కుమారుడి కోసం ఇటీవలే ఓ కిరాణా షాప్ ప్రారంభించాడు. షాపు నిర్వహణలో తనమునకలైతే మానసికంగా కొంత ఉపశమనం పొందుతాడని ప్రభు భావించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు.