పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంలోపే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహ రచన చేస్తోంది తెలుగుదేశం పార్టీ. విభజన హామీలపై బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఉన్నఅన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో.. జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మరోసారి టీడీపీ అధినేత సమాయత్తం అవుతున్నారు. ఢిల్లీలోనూ ఉద్యమ వేడిని రగిలించేందుకు టీడీపీ వ్యూహం రచిస్తోంది. హక్కుల సాధనకోసం దీక్షలు చేస్తూనే.. రాష్ర్టానికి చేసిన అన్యాయంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని యోచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.జులై 18 నుంచి ఆగస్టు 10 వరకు మాన్‌సూన్ సెషన్స్ జరగనున్నాయి. మొత్తం 18 రోజుల పాటు సాగనున్న సమావేశాల్లో ఏపీకి చెందిన పార్టీల నేతలు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. కడపలో సీఎం రమేశ్, బీటెక్ రవి దీక్షతోపాటు.. విశాఖలో రైల్వే జోన్‌కోసం ఎంపీలు చేసిన ఒక రోజు దీక్షతో కేంద్రానికి సెగ తగిలేలా చేసింది టీడీపీ. దీనితర్వాత వెనుకబడిన జిల్లాలకు నిధులు డిమాండ్ చేస్తూ.. అనంతపురంలో మరో ఉద్యమానికి ప్రణాళిక రచిస్తోంది. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకోవాలని చూస్తోంది. కేంద్రంపై మరోసారి అవిశ్వాసం పెట్టేందుకు సైతం టీడీపీ సమాయత్తం అవుతోంది.మరోవైపు వైసీపీ, జనసేన పార్టీలు కూడా ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్నాయి. అటు కేంద్రంపైనా, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపైనా ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు పార్టీ అధినేతలు. ఇప్పటికే తమ ఎంపీలతో రాజీనామాలు చేయించానన్న స్ట్రాటజీతో జగన్‌మోహన్‌రెడ్డి... మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ఏపీలో యాత్రలుచేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలు దీనిని సవాల్‌గా తీసుకోవాలని మీటింగ్‌లలో చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా రాజ్యసభలో బలం ఉండడంతో ప్రత్యేక హోదాపై బీజేపీని ఇరుకున పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు.ఏదేమైనా పార్లమెంట్ మాన్‌సూన్ సెషన్స్‌లో ప్రత్యేక హోదా అంశంపై క్లారిటీ వస్తుందో..లేక బీజేపీ మొండిగానే వ్యవహరిస్తుందో చూడాలి.