తెలుగునేల జీవధార గోదారమ్మ..కోట్లాది ప్రజల దాహార్తిని తీరుస్తున్న గోదారికి అడుగడుగునా గర్భశోకమే.నది ఆక్రమణల చెరలో నలిగిపోతోంది. సాఫీగా సాగిపోవాల్సిన నీటి ప్రవాహానికి కొందరు అక్రమార్కులు అడ్డుకట్ట వేస్తున్నారు. దీనిపై నిఘా ఉంచాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండడంతో నదిలో ఆక్రమణలపర్వం కొనసాగుతోంది.పర్యాటకం పేరుతో కొందరు, ఆధ్యాత్మికత ముసుగులో మరికొందరు, రొయ్యలు, చేపల చెరువులతో ఇంకొందరు ఏకంగా గోదావరిని పూడ్చివేస్తున్నారు.ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ నదిపై రెండు వేలకు పైగా ఆక్రమణలు ఉన్నాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రెండు జిల్లాల్లో గోదావరి గట్లు, నదీ పరీవాహక ప్రాంతాల్లోని భూముల్లో సంబంధిత అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. ఇందులో ఎ.బి.సి. అని మూడు కేటగిరీలుగా విభజించారు.
జిల్లాలోని అమలాపురం, ఆత్రేయపురం, (పి.గన్నవరం తదితర నియోజకవర్గాల్లో నదీ గర్భంలోనే నిబంధనలకు విరుద్ధంగా చేపలు, రొయ్యల చెరువులను తవ్వేస్తున్నారు. దీనికితోడు ఈ చెరువుల్లో వినియోగించిన నీటిని మళ్లీ గోదావరి నదిలోకి వదిలివేస్తూ తీవ్ర కాలుష్యానికి కారకులవుతున్నారు. గోదావరి ప్రవాహానికి అట్టుకట్టపడే ఏచర్యలకూ పాల్పడకూడదని చట్టం చెబుతోంది. ఏటిగట్లను యథేచ్ఛగా పూడ్చివేస్తుండడంతో నీటి ప్రవాహం గతి తప్పుతోంది.
రాజమహేంద్రవరంలోని ఆల్కాట్‌గార్డెన్ వద్ద రైతుబజారు సమీపంలో గోదావరి నది పెద్ద ఎత్తునఆక్రమణకు గురవుతోంది. గోదావరి గర్భం నుంచి పైవరకు ఇళ్ల శిథిలాలతో కొందరు పూడ్చివేస్తున్నారు. సుమారు 200 మీటర్ల పొడవున గోదావరి గట్టు ఆక్రమణకు గురైంది. దీంతో గోదావరి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ప్రమాదకరంగా మారుతోంది. ఈ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గోదావరి ఒడ్డున ఆక్రమణలు సాగిపోతున్నాయి. నదీ గర్భం, పరివాహక ప్రాంతాలపై జలవనరుల శాఖ అధికారులదే బాధ్యత ఉంటుంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నదిలో ఆక్రమణలను నివారించాల్సిన అవసరమున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. నది పరీవాహక ప్రాంతంలో జిరాయితీ భూమి ఉంటే అక్కడ నిర్మాణలు చేపట్టేందుకు అనుమతించాలని సంబంధిత అధికారులు రెవెన్యూ శాఖకు సిఫార్సు చేస్తారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. జలవనరుల శాఖ అధికారులకు తెలియకుండానే 80 శాతం ఆక్రమ కట్టడాల నిర్మాణానికి రెనెన్యూ అధికారులే అనుమతలు జారీ చేయడం గమనార్హం.ఇలా అనుమతులు ఇచ్చిన వారిలో తహసీల్దారు స్థాయి అధికారులే ఎక్కువ మంది ఉన్నారు.