కర్ణాటకకు సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. గత ఎన్నికల్లోనూ మోడీ వర్సెస్ సిద్ధరామయ్య అనేలాగా వార్ నడిచిందన్నది. సిద్ధరామయ్య తాను ప్రవేశపెట్టిన పథకాలే తనను గట్టెక్కిస్తాయని ఆయన నమ్మారు. కాని కాలం కలసి రాకపోవడంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను బీజేపీ దెబ్బతీసింది. అతి పెద్ద పార్టీగా ఏర్పడిన బీజేపీకి అధికారాన్ని దూరం చేయాలన్న లక్ష్యంతో అతి చిన్న పార్టీ జేడీఎస్ తో చేతులు కలిపి వారికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇంత త్యాగం చేసినా కుమారస్వామి దానిని గుర్తించడం లేదంటున్నారు. కుమారస్వామి తాను అనుకున్నది అనుకున్నట్లు అమలు చేస్తూ వెళుతుండటం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడటం లేదు. నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ తోనే మాట్లాడుకుంటూ తనకు తోచిన నిర్ణయాలను కుమారస్వామి తీసుకుంటుండటంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు కూడా కుమారస్వామి ధైర్యంగా చెక్ పెట్టేస్తున్నారు. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారాన్ని సాకుగా చూపుతూ ముఖ్యమంత్రి కుమారస్వామి తీసుకుంటున్న నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా తాను ప్రవేశపెట్టిన పథకాలను సంకీర్ణ ప్రభుత్వంలో గండికొట్టడాన్ని సిద్ధరామయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండగా అన్న భాగ్య పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి నెలకు ఏడు కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తారు. అయితే ఈ బడ్జెట్ సమావేశంలో కుమారస్వామి ఈ పథకంపై తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ శ్రేణులను విస్మయపర్చింది.అన్న భాగ్య కింద ఇచ్చే ఏడు కిలోల బియ్యం స్థానంలో ఐదు కేజీలనే ఇక నుంచి ఇవ్వాలని కుమారస్వామి నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్ లోనూ ఆ మేరకే నిధులను కేటాయించారు కుమారస్వామి. కుమారస్వామి నిర్ణయం వల్ల దాదాపు ఏడాదికి ఆరు వందల కోట్లు ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు. దీంతోసిద్ధరామయ్య కు ఆగ్రహం కలిగినట్లుంది. అందుకోసం ఆయన ముఖ్యమంత్రి కుమారస్వామికి ఘాటుగానే లేఖ రాశారు. అన్న భాగ్య పథకం పేద ప్రజల నుద్దేశించి ఏర్పాటు చేసిందని, దానివల్ల 3.85 కోట్ల మంది లబ్ది పొందుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ పథకం కోసం చేసే ఖర్చును ఆర్థిక భారంగా చూడటం విచారకరమని సిద్ధూ తన లేఖలో పేర్కొన్నారు. ఈ పథకం కింద తగ్గించిన రెండు కిలోల బియ్యాన్ని వెంటనే ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కుమారస్వామి సిద్ధూ లేఖకు ఎలా స్పందిస్తారో తెలియదు కాని ఆయన మాత్రం తన పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పంట రుణాల మాఫీపైనే కుమారస్వామి దృష్టి పెట్టారు. పంటరుణాల మాఫీతో ఖజానాపై దాదాపు 34 వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. అందువల్లనే ఇలాంటి పథకాల ఖర్చును తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన అని జేడీఎస్ నేతలు చెబుతున్నారు. ఐదు విడతల్లో ఈ రుణాలను చెల్లించేందుకు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈనేపథ్యంలో కుమారస్వామి తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లోనే వేలు పెట్టడాన్ని కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. సంకీర్ణంలో తాము భాగస్వామ్యులమేనని గుర్తుంచుకోవాలన్నారు. సంకీర్ణ సర్కార్ సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఉన్న సిద్ధరామయ్య ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.